అపురూపం | Sakshi
Sakshi News home page

అపురూపం

Published Wed, Oct 21 2015 3:39 AM

finishing touches on venues

సర్వాంగ సుందరంగా ఉద్దండరాయునిపాలెం
 
 తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదికలు
 ప్రాంగణంలో సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం
 రెండు గంటల పాటు సభ ఏర్పాట్ల పరిశీలన
 కంపార్టుమెంట్‌లలో సీటింగ్‌పైనే ప్రధానంగా చర్చ
 రైతులకు, వీఐపీలకు తొలి వరుసలో ప్రాధాన్యం
 ఏర్పాట్లు పరిశీలించిన 16మంది రాష్ట్ర మంత్రులు
 సందర్శకులకు అనుమతి నిరాకరణ

 
విజయవాడ : రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సభాప్రాంగణంలో పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. మరో 24 గంటల వ్యవధిలో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రాంగణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వేదిక నిర్మాణం మొదలుకొని కంపార్టుమెంట్‌ల వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి.

పార్కింగ్ ప్రదేశాలతోపాటు ఉద్దండరాయునిపాలెం చేరుకోవడానికి  ఉన్న తొమ్మిది ప్రధాన రహదార్లకు మరమ్మతులు పూర్తిచేసి సిద్ధం చేశారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని, ప్రధాని భద్రతకు విఘాతం కలుగుతుందనే కారణంతో సందర్శకుల అనుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించి సభాప్రాంగణం అంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శంకుస్థాపన జరిగే ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మరోవైపు సభా ప్రాంగణంలో ప్రధాని ఆశీనులయ్యే వేదిక నిర్మాణం పూర్తయింది. ఎస్పీజీ సూచనలతో ప్రత్యేక వేదికలు నిర్మించారు. 12 లక్షల అడుగుల మేర భారీ షెడ్‌లను కంపార్టుమెంట్‌ల కోసం నిర్మించారు. మొత్తం 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కంపార్టుమెంట్‌లో 20 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపార్టుమెంట్‌ను ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు.

సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం..
 మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సంకల్ప జ్యోతిని సభాప్రాంగణంలో చంద్రబాబు వెలిగించారు. అంతకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రాంగణానికి చేరుకున్న పవిత్ర మట్టి, నీటి కలశాలకు సీఎం ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. అక్కడి నుంచి 13 జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు, రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల నమూనా దేవాలయాలతో ఉన్న వాహనాలు సభాప్రాంగణానికి చేరుకున్నాయి. క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ముఖ్యమంత్రి రెండు గంటల సేపు సభాప్రాంగణంలో కలియదిరిగి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. సీఎంతోపాటు 16 మంది రాష్ట్రమంత్రులు ఏర్పాట్లు పరిశీలించారు. ఇంకోవైపు బుధవారం నుంచి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హోమ ద్రవ్యాలు తీసుకువచ్చారు.

 పీఎం కాన్వాయ్ ట్రయల్న్
 ప్రధాన మంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పోలీసు అధికారులు నిర్వహించారు. దీంతోపాటు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు ట్రయల్ రన్ నిర్వహించాయి.

Advertisement
Advertisement