రైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి - Sakshi


కడప కార్పొరేషన్/పెండ్లిమర్రి:

 రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని  వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సభ్యులు  ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి పెండ్లిమర్రి మండలంలోని చీమలపెంట, రేపల్లె, బాలయ్యగారి పల్లె, రామచంద్రాపురం గ్రామాలలో దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, మినుము పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా  నాగిరెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న  22 కేంద్ర సహకారం బ్యాంకులకు గాను 18 బ్యాంకులు



 దివాళా  తీశాయన్నారు.  అక్టోబర్ నెలలో పచ్చగా ఉండాల్సిన పంటలు ఎండిపోతున్నాయన్నారు.  రాష్ట్రమంతటా  కరువు తాండవిస్తోందన్నారు. 55 శాతం సాగు  అయినట్లు  రికార్డులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా 20 శాతమే జరిగిందన్నారు. పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ఎన్యుమరేషన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.



దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆమరణ దీక్ష చేశారని, అప్పుడు ఆయన డిమాండ్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో  తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.  రూ. 5వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని  ఎన్నికల్లో  చెప్పి, బడ్జెట్‌లో దాని ప్రస్తావనే తేలేదన్నారు.



రుణాలు రెన్యూవల్ కాకపోవడం వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం జమ కాక రైతులు నష్టపోయారన్నారు. వ ర్షాలు రాక, పంటలు పండక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్స్యూరెన్ లేక, నష్టపరిహారం అందక రైతులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.



 రైతులు నష్టపోయిన పెట్టుబడిని ప్రభుత్వమే ఇవ్వాలి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి  

 వర్షాభావం వల్ల రైతుల నష్టపోయిన పెట్టుబడిని ప్రభుత్వమే చెల్లించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లికి ఎకరాకు రూ. 50వేలు, వేరుశనగ, మినుము, పెసర, పత్తి పంటలకు రూ. 25వేలు పెట్టుబడి నష్టం కింద ఇవ్వాలన్నారు.



చంద్రబాబు మోసపూరిత విధానాల వల్లే రైతులు ఇన్సూరెన్స్ నష్టపోయారన్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులను కూడా డీఫాల్టర్స్‌గా చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని రైతులు భావించినట్టుగానే ఇప్పుడు జరుగుతోందన్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతంలో తీవ్ర అనావృష్టి వల్ల, మరో ప్రాంతంలో అతివృష్టి వల్ల రైతులకు నష్టం వాటిల్లిందన్నారు.  



కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయ అధికారిణి నాగార్చన, ఉద్యానవన శాఖ హెచ్‌ఓ రేణుకా ప్రసాద్‌రెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి, జెడ్పీటీసీ పసల భాస్కర్, సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగేంద్రారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి,  మాజీ మండల ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, నాగమల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలయ్య, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, పుల్లారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top