బాలయ్యా.. ఎక్కడయ్యా..

హిందూపురం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ పీఏ శేఖర్ - Sakshi


‘అందరూ నన్ను స్థానికేతరుడు అంటున్నారు. మానాన్న కాలం నుంచి హిందూపురం మాకు కొత్త కాదు. ఇక్కడే ఇల్లు తీసుకున్నా. హిందూపురంలోనే ఉంటా. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యేగా అండగా ఉంటా. ముందు ప్రజలు.. తర్వాతే సినిమాలు’ అని ఎన్నికలప్పుడు పదే పదే చెప్పిన బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఐదు నెలల్లో మూడంటే మూడు సార్లు మాత్రమే హిందూపురంలో పర్యటించారు.  నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘జన్మభూమి’లో రాష్టంలోని ఎమ్మెల్యేలందరూ పాల్గొంటున్నా బాలకృష్ణ మాత్రం పత్తా లేరు.

 

 సాక్షిప్రతినిధి, అనంతపురం :  ఎన్నికలకు ముందు బాలయ్య ప్రజలకు చేసిన బాసలను పూర్తిగా మరిచిపోయాడు. సినిమాలే తనకు ప్రథమమని, ప్రజలు, ప్రజా సమస్యలన్నీ ఆ తర్వాతే అని చెప్పకనే చెబుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్టోబరు 2న ‘జన్మభూమి-మాఊరు’ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు చెందిన 174 మంది ఎమ్మెల్యేలు ‘జన్మభూమి’లో పాల్గొంటున్నారు.



ప్రజా సమస్యలు..పల్లెసీమల కష్టాలు తెలుసుకోవడం, సమస్య తీవ్రతను బట్టి వీలైతే తక్షణ పరిష్కారం చూపడం, లేదంటే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుపోయేలా చొరవ చూపుతున్నారు. ఎవరికి వారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఒక్కరోజు కూడా జన్మభూమిలో పాల్గొనలేదు. అక్టోబరు 2 నుంచి 12 వరకూ మొదటివిడత జన్మభూమి నిర్వహించారు. ఆ పది రోజులు బాలయ్య జన్మభూమికి రాలేదు. ఆపై హుదూద్ తుఫాన్ వల్ల తాత్కాలికంగా బ్రేక్ వేశారు.



తిరిగి ఈ నెల ప్రారంభం నుంచి పునఃప్రారంభించారు. మొదటి విడత హాజరు కాకపోవడంపై బాలయ్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం రెండో విడతలోనైనా పాల్గొంటారని ప్రజలు ఆశించారు. రెండు రోజుల్లో రెండో విడత కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకూ బాలయ్య నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడ లేదు. దీంతో ఓట్లేసి గెలిపించిన ప్రజలు తమ ఎమ్మె ల్యే వైఖరిపై మండిపడుతున్నారు. బాధ్యత తెలీని వ్యక్తికి ఓట్లేసి గెలిపించినందుకు బాధపడుతున్నారు.



 ఎమ్మెల్యేగా మూడుసార్లు మాత్రమే..

 ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా హిందూపురంలో బాలయ్య అద్దె ఇల్లు తీసుకున్నారు. కుటుంబంతో సహా వచ్చి పాలు పొంగించారు. తర్వాత మరో ఇల్లు.. ఆపై ఇంకో ఇల్లు. ఇలా మూడు నివాసాలు మారిన బాలయ్య ఎమ్మెల్యేగా ఐదు నెలల కాలంలో మూడుసార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురం మునిసిపాలిటీ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు ఓసారి, కృష్ణదేవరాయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మరోసారి, ఎన్టీఆర్ సుజలస్రవంతిని ప్రారంభించేందుకు ఇంకోమారు వచ్చారు.



 ఆయనే అనధికారిక ఎమ్మెల్యే

 ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఈ ప్రాంతం వైపు చూడకపోవడంతో ఆయన పీఏ శేఖర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్ జన్మభూమిలో నిత్యం అధికారిక వేదికను పంచుకుంటున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు కూడా ఁజీ..హుజూర్*అని ఆయన చెప్పినట్లు తలూపుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధి కాని ఓ వ్యక్తిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జన్మభూమిలో ఎలా వేదికపై కూర్చోబెడతారో.. జిల్లా ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top