ఏడాదిలో ఏం చేశారు..?


బీజేపీ ఏడాది పాలనపై కాంగ్రెస్ నిరసన

కార్పొరేట్ సంస్థలకు మోదీ కొమ్ముకాస్తున్నారని ధ్వజం

పట్టణంలో నిరసన ర్యాలీ


 

 వినుకొండ : మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ఏడాది కాలంలో చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ధ్వజమెత్తారు. బీజేపీ ఏడాది పాలనను నిరసిస్తూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.



ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వంద రోజుల్లో తీసుకువ స్తామని ప్రగల్భాలు పలికిన  మోదీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ధరల నియంత్రణ హామీని ఎప్పుడో మరిచిపోయారన్నారు. ఏపీకి ప్రత్యే హోదా హామీని తుంగలో తొక్కారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి వెంకయ్యనాయడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



కార్యక్రమంలో ములకా రామతులసిరెడ్డి, అనుమల నాగప్రసాదు, రెడ్డి వెంకటరత్నం, గుంటకల ప్రసాద్, లాయర్లు కుమారరాజా, ఎలిశెట్టి నరసింహారావు, చంద్రబాబు, శ్రీనివాసరావు, భూమా చంద్రశేఖర్, ముత్తినేని గిరిబాబు, పొట్లపాడు వలి, ఆచారి, గంటా కాలేషా, మాల్యాద్రి, నన్నేసా పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top