'ఆయన మాట్లాడితే జనం నవ్వుతారు'

'చంద్రబాబు మాట్లాడితే జనం నవ్వుతారు' - Sakshi


నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించారని వైఎస్సార్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉన్నాళ్లు ప్రజాస్వామ్య మనుగడ కష్టాల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారులకు పదవులు ఇచ్చి ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు.



వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని, నంద్యాల ప్రజలు ఇవన్ని గమనించాలని కోరారు. పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామకే వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చారని.. ఎమ్మెల్యే అయిన మంత్రి పదవి నుంచి హరికృష్ణను తప్పించారని తెలిపారు. మంత్రి అఖిలప్రియకు కూడా అదే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలకు చంద్రబాబే కారణమన్నారు. శోభా నాగిరెడ్డి బతికుంటే భూమా నాగిరెడ్డి పార్టీ మారేవారు కాదని చెప్పారు. వైఎస్‌ కుటుంబంతో భూమా కుటుంబానికి చాలా అనుబంధం ఉందని, అందుకే ఆ కుటుంబానికి మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.



వైఎస్‌ జగన్‌ నైతిక విలువలు పెంపొదిస్తుంటే.. చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. శిల్పా చక్రపాణిరెడ్డితో జగన్‌ రాజీనామా చేయించినా.. 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించలేదని తెలిపారు. విలువల గురించి చంద్రబాబు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. జిల్లాకో రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటన్నారు. నంద్యాలలో కండువాలు లేకుండా ప్రచారం చేయాలని బీజేపీ నేతలకు చెబుతున్నారని, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం కండువాలు వేసుకోవాలట అని మేకపాటి అన్నారు. ముస్లింలు, దళితులు, కాపులు, బలహీనవర్గాలు ఎప్పుడూ వైఎస్సార్‌ సీపీ వెంట ఉంటారని చెప్పారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top