
చెప్పినట్లు చేస్తే కేసులుండవ్..
అధికారులు పాలనాపరమైన తప్పులు చేసినా, నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నా..
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తులు నిరోధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఇప్పుడు కూడా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ నిర్ణయాలను ఏసీబీ, విజిలెన్స్‌ల విచారణ పరిధి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు నెలకొల్పే యూనిట్లు, పరిశ్రమలకు రాయితీలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, భూములను తక్కువ ధరకు కేటాయించడం వంటి అంశాల్లో సంబంధిత అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ చేపట్టకూడదని పేర్కొంది. ‘నిబంధనలు అనుమతించకపోయినా నేను (సీఎం) చెప్పినట్లు లేదా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు కోరిన మేరకు మీరు (అధికారులు) నిర్ణయాలు తీసుకోండి.
మీపై ఎటువంటి కేసులు, దర్యాప్తులు లేకుండా నేను చేస్తా..’ అని భరోసా ఇస్తున్నట్టుగా ఆ ఉత్తర్వులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రహదారులు, రేవులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, లైట్ రైల్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు పెట్టే పెట్టుబడి ప్రాజెక్టులకు రాయితీలను కల్పించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారులను ఏసీబీ, విజిలెన్స్ విచారణల పరిధి నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంబంధిత ఫైళ్లను తొలుత ఎస్‌ఐపీసీ పరిశీలిస్తుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా లేదా రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించేలా ఉన్నా ఆ విషయాలను ఆ ఫైళ్లల్లో రాస్తుంది. అంతే కాకుండా ‘నిబంధనలు ఇలా ఉన్నాయి.. రాయితీలు ఇంతవరకు మాత్రమే వర్తిస్తాయి. కానీ అందుకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో సంస్థలు రాయితీలు కోరుతున్నాయి. అందువల్ల వీటిపై సీఎం నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) నిర్ణయం తీసుకోవాలి..’ అంటూ ఎస్‌ఐపీసీ ఫైళ్లలో స్పష్టంగా రాస్తుంది. అయితే ఎస్‌ఐపీసీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను, రాష్ట్ర ప్రయోజనాలకు వాటిల్లే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎస్‌ఐపీబీ నిర్ణయాలను తీసుకుంటోందనే ఆరోపణలున్నాయి.
ఈ నిర్ణయాలు భవిష్యత్‌లో తన మెడకు చుట్టుకుంటాయని భావించిన ముఖ్యమంత్రి ముందుజాగ్రత్త చర్యగా ఎస్‌ఐపీసీ నిర్ణయాలపై ఏసీబీ, విజిలెన్స్ విచారణలు చేపట్టకుండా నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎటువంటి విచారణలకు వీల్లేకుండా చేయడం ద్వారా.. నిబంధనలు ప్రస్తావిస్తూ బాహాటంగా సంబంధిత ఫైళ్లపై ఏమీ రాయవద్దంటూ ఎస్‌ఐపీసీ అధికారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లైందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.