ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం

ప్రత్యేక హోదా సాధనలో  చంద్రబాబు విఫలం - Sakshi


ఆయనొక అసమర్థ సీఎం

మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్


 

విజయవాడ (మధురానగర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హెచ్‌బీ చౌదరి పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని నీతి ఆయోగ్ చెప్పిందని పేర్కొనడం తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.  ప్రత్యేక హోదాపై కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని,  కేంద్ర మంత్రివర్గం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరారు.



తాను 22 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు.  హెచ్‌బీ చౌదరి ప్రకటనతో సీఎం చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు. సీఎం, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలంటూ అడగలేని దుస్థితిలో ఉన్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. తాను ప్రత్యేక హోదాపై పోరాడలేని దద్దమ్మను అని సీఎం ఒప్పుకుంటే.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా ప్రత్యేక హోదా సాధించటానికి తాము సిద్ధమేనని జోగి రమేష్ చెప్పారు.



ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

ప్రత్యేక హోదా ఆంధ్రుల  హక్కు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలుగు ప్రజల వాడీవేడిని కేంద్రానికి చూపిస్తామన్నారు. హోదాపై వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవటం విచారకరమన్నారు.  అమరావతి నిర్మిస్తున్నామంటూ నగరంలోనే మకాం వేసిన సీఎం రాజకీయ వ్యభిచారం చేస్తూ రోజుకో ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం అంటే ప్రజలు అని, ఎంతమంది ఎమ్మెల్యేలను కొన్నా ప్రజల మనస్సుగెలవలేరని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 



ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌పై హక్కు ఉన్నప్పటికీ కేసీఆర్‌కు భయపడి ఆరునెలలకే పారిపోయి  ఇక్కడికి మకాం మార్చారన్నారు. చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల నాయకులను ప్రాధేయపడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి  ప్రత్యేక హోదా తీసుకువస్తే వారే మన వద్దకు వచ్చి పెట్టుబడులు పెడతారని జోగి రమేష్ చెప్పారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారని, రాష్ట్రంలోని యువతను జాగృతం చేశారని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top