పునర్విభజన ఇప్పట్లో లేనట్లే!

పునర్విభజన ఇప్పట్లో లేనట్లే! - Sakshi


తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కదలిక శూన్యం

విభజన జరిగి 8 నెలలైనా కనిపించని కార్యాచరణ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత... పట్టించుకోని కేంద్రం

కమిటీ ఏర్పాటు, ముసాయిదా తయారీ, ప్రజాభిప్రాయ సేకరణ, సవరణలు చేయాలి.. ఈ మొత్తం ప్రక్రియకు పట్టే సమయం.. కనీసం రెండేళ్లు

కేంద్ర న్యాయశాఖలో ఇంకా రూపుదిద్దుకోని ముసాయిదా

ఏర్పాటై పుష్కరం దాటినా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో పాత స్థానాలే

రాజ్యాంగ సవరణ చేయకపోతే.. 2031 తర్వాతే కొత్త నియోజకవర్గాలు




సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అంశం అటకెక్కనుందా? కొత్త స్థానాల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టిందా?... ఇటీవలి పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 26, 15 సెక్షన్ల ప్రకారం... వీలైనంత త్వరగా రాజ్యాంగంలోని 170వ అధికరణానికి సవరణ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించాలి. ఏపీలో ఇప్పుడున్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కు పెంచాలి.



కానీ రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిది నెలలైనా ఈ దిశగా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనపై సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 2000వ సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికీ పాత నియోజకవర్గాలే కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించటంతో... ఇప్పుడా ప్రక్రియ రాష్ట్రానికి అత్యవసరమైంది.



కదలిక శూన్యం

విభజన చట్టం మేరకు తెలంగాణ, ఏపీల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభం కావాల్సి ఉంది. లోక్‌సభ స్థానాలను యథాతథంగా ఉంచి... ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో రెండేసి శాసనసభ స్థానాల చొప్పున పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ స్థానాలుండగా... పునర్విభజన తర్వాత ఆ సంఖ్య తొమ్మిదికి పెరుగుతుంది. అయితే పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావాలంటే రాజ్యాంగంలోని 170వ అధికరణకు సవరణలు తేవాలి. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఏర్పాటు, ముసాయిదా తయారీ, ప్రజాభిప్రాయ సేకరణ, సవరణల అనంతరం తుది ముసాయిదా రూపకల్పన తదితర సుదీర్ఘ కార్యాచరణను చేపట్టాల్సి ఉంటుంది.



ఈ మొత్తం ప్రక్రియకు కనీసం రెండు సంవత్సరాలకు పైగానే సమయం పడుతుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ జరిగితే... పునర్విభజన కమిటీ ఏర్పాటుకు కార్యాచరణ మొదలయ్యే అవకాశముంది. కానీ రాజ్యాంగ సవరణ, పునర్విభజన కమిటీకి సంబంధించి కేంద్ర న్యాయశాఖలో ఎలాంటి ఎజెండా లేదని సమాచారం. అంతేగాకుండా ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా దీనిపై పెద్దగా ఒత్తిడేదీ లేనందున... కేంద్రం కూడా వేచి చూసే ధోరణితో ఉందని ఢిల్లీలో కీలక పదవిలో ఉన్న ఒక తెలుగు అధికారి వెల్లడించారు.



14 ఏళ్లయినా పాత స్థానాలే..

2000 సంవత్సరంలో ఏర్పడిన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో... కేవలం ఒక ఉత్తరాఖండ్‌లోనే శాసనసభ స్థానాల పెంపు జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయిన సమయంలో ఉత్తరాఖండ్‌కు 22 శాసనసభ స్థానాలేరాగా... ‘ఉత్తరప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2000’ మేరకు అదనంగా మరో 58 స్థానాలు పెంచారు. ‘మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం’లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని చేర్చకపోవటంతో... మిగతా రెండు రాష్ట్రాల్లో పాత స్థానాలే కొనసాగుతున్నాయి.



జార్ఖండ్‌లో అతి తక్కువ శాసనసభ స్థానాలు (81) ఉండటం వల్లే ఏర్పాటైన పద్నాలుగేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలు, మూడుసార్లు రాష్ట్రపతి పాలన వచ్చాయని... తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయకపోతే... 2026వ సంవత్సరం వరకు ఇవే స్థానాలు కొనసాగుతాయన్నారు. అదే జరిగితే తెలంగాణలో రాజకీయ అస్థిరతకు అవకాశం లేకపోలేదని శశిధర్‌రెడ్డి చెప్పారు.



ఎటూ తేలని పరిస్థితి..

రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుండి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన వ్యవహారానికి కూడా నియోజకవర్గాల పునర్విభజనే శాశ్వత పరిష్కారం కానుంది. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... తమను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా సభ్యులుగా చేర్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాంకేతికంగా వారికి అలా అనుమతించే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన చూస్తే తెలంగాణ నుండి ఏపీకి బదిలీ అయిన ప్రజలకు ఎంపీ, ఎమ్మెల్యేలు లేకుండా పోతారు. దీని కారణంగానైనా పునర్విభజన అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.



పునర్విభజన తర్వాతే..!

శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ముందుకు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేకపోయినా... తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన మంచిర్యాల, మెదక్, సిద్దిపేటలను జిల్లా కేంద్రాలుగా మారుస్తామని విధాన ప్రకటన సైతం చేశారు. మొత్తంగా తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుంది.



ఒక నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న లక్ష్యంతో... అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసే దిశగా తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్‌లో 16 జిల్లాలుండగా కొత్తగా 11 జిల్లాల ఏర్పాటుతో 27కు పెరిగాయి. ఇక జార్ఖండ్‌లో తొలుత 18 ఉండగా ఆరు కొత్త జిల్లాలతో 24కు.. ఉత్తరాఖండ్‌లో పాతవి 13 జిల్లాలు ఉండగా కొత్తగా మరో నాలుగు జిల్లాలను ప్రతిపాదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top