’చంద్రబాబు ఏరకంగా అవినీతికి పాల్పడ్డారంటే..’

’అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ - Sakshi

  • చంద్రబాబు ఏరకంగా అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు వివరించాలి: అంబటి రాంబాబు

  • గుంటూరు: ప్రస్తుతం అవినీతి చక్రవర్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ రాష్ట్రాన్ని గత మూడేళ్లుగా పాలిస్తున్న సీఎం చంద్రబాబే ఆ అవినీతి చక్రవర్తి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి నెలకొని ఉందని, ఇందుగలదు.. అందు లేదు అనే సందేహం లేదనే రీతిలో అవినీతి రాష్ట్రంలో పాకిపోయిందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన 'చంద్రబాబు అవినీతి చక్రవర్తి' పుస్తకం గురించి అంబటి వివరించారు. 


    'రాజుల గొప్పతనాల గురించి కవులు, రచయితలు పుస్తకాలు రాయడం చూశాం. కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి మీద పుస్తకం రాశామంటే అది ఏ స్థాయిలో ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ అనే పుస్తకం గత ప్లీనరీ సమావేశాల్లో ఒక ఎడిషన్‌ విడుదల చేశాం.  మూడేళ్ల కాలంలో జరిగిన అవినీతిపై మరో ఎడిషన్‌ ప్రచురించాం' అని అన్నారు. 'మొదటి పుస్తకంలో రూ. 1,45,549 కోట్ల మేర అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారంటూ ఆధారాలతో కూడిన వివరాలిచ్చాం. రెండో పుస్తకంలో రూ. 3 లక్షల 75 వేల 8 కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని ఆధారాలతోసహా ముద్రించాం. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. చంద్రబాబు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో.. ఏ రకంగా డబ్బులు వెనకేసుకున్నారో ఆధారాలతో సహా ఇందులో వివరంగా పొందుపర్చాం' అని అన్నారు.



    'చంద్రబాబు అవినీతి చక్రవర్తి' పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. 'పురాణాల్లో హిరణ్యకశకుడు ప్రహ్లాదుడిని మీ హరి ఎక్కడున్నాడని అడుగుతాడు.. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడనే సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందు కలడు అని మంచి మాట చెబుతాడు. దానినే మనం అన్వయించుకుంటే ఇందుగలదు.. అందు లేదనే సందేహం వలదు. రాష్ట్రంలో ఎందెందుకు వెతికినా చంద్రబాబు అవినీతికి కలదు' అని అంబటి దుయ్యబట్టారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిది ఏళ్లు పాలించినప్పుడు.. హైటెక్‌ సిటీ పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని చేశారని,  హైటెక్‌ సిటీ ఎక్కడ వస్తుందో  ముందుగానే ఎంపీ మురళీమోహన్‌కు చెప్పి.. అక్కడ  భూములు కొన్న తర్వాత హైటెక్‌ సిటీ ప్రకటించారని, ఆ తరవాత మురళీమోహన్‌ కొన్న భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్నారన్నారని విమర్శించారు.



    అదేవిధంగా ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కూడా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌ బినామీలకు ముందుగానే లీకులు ఇచ్చి ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించి..  పెద్ద భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని అన్నారు. విశాఖ ప్రాంతంలో భూముల రికార్డులను తారుమారు చేసి లక్షల కోట్ల రూపాయల భూములను తెలుగుదేశం నేతలకు కట్టబెట్టారన్నారు. ఈ పుస్తకంలోని బాబు అవినీతి గురించి వివరంగా చెప్పాలంటే రెండు ప్లీనరీలు పెట్టినా సరిపోదని, జిల్లా కేంద్రాల్లో కౌంటర్లు ఓపెన్‌ చేశామని, అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.


     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top