‘పది’ పరీక్షకు అంతా సిద్ధం


విజయనగరం : పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించారు. అయితే ఈ ఏడాది కూడా కొన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యలు లేవు. ముఖ్యంగా కొన్నిచోట్ల ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. కేంద్రాల వద్ద సీసీ కెమరాలు, తాగునీరు, బెంచీలు ఇప్పటికే సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక‌్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

 

సాలూరురూరల్‌: మండలంలోని కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలోని ఏ, బీ సెంటర్లలో 9 పాఠశాలలకు చెందిన 454 మంది పరీక్ష రాయనున్నారు. ఏ సెంటర్‌లోని 10 గదుల్లో 240 మంది, బీ సెంటర్‌లోని 7 గదుల్లో 214 మంది పరీక్ష రాసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సెంటరుకు 5 చొప్పున సీసీ కెమెరాలు అమర్చారు. అయితే గదుల్లో ఫ్యాన్లు పూర్తిస్థాయిలో లేవు. బి సెంటర్‌లో 5 రేకుల గదులున్నాయి. ఈ గదుల్లో ఎండ తీవ్రతకు వేడి అధికంగా ఉంటుందని పలువురు అంటున్నారు. మొత్తం ఐదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే కురుకూటి పాఠశాల, పాచిపెంట మండలం సరాయివలస పాఠశాల విద్యార్థినులు ఈ కేంద్రంలోనే పరీక్షలు రాస్తారు.



పరీక్షలు పూర్తయ్యేంతవరకు వారికి కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వద్దే ఆశ్రయం కల్పిస్తున్నట్లు హెచ్‌ఎం గునరాజు తెలిపారు. తోణాం, పాచిపెంట మండలం వేటగానివలస సంక్షేమ పాఠశాలల విద్యార్థులు బంగారమ్మపేట వద్ద వసతిగృహంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. కరాసవలస కస్తూర్బా, అంటివలస, పాచిపెంట మండలం వేటగానివలస పాఠశాలల విద్యార్థులు కూడా ఇక్కడే పరీక్ష రాస్తారు.

ఏర్పాట్లు పూర్తి:

మెంటాడ: మండలంలో ఈ నెల 17 నుంచి 30 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 545 మంది హాజరవుతారు. చల్లపేట పాఠశాలలో 193 మంది, మెంటాడ పాఠశాలలో 171మంది, పెదమేడపల్లి మోడల్‌ స్కూల్‌లో 181 మంది పరీక్షలు రాస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈఓ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. బెంచీలు, తాగునీరు, వైద్య సదుపాయం సిద్ధం చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

 

శిథిల భవనంలోనే పరీక్ష


 


పాచిపెంట: స్థానిక ఉన్నత పాఠశాల, పి.కోనవలస గురుకుల పాఠశాలల్లో పరీక్షలు జరగనున్నాయి. పి.కోనవలస పాఠశాలలో వసతులున్నాయి. పాచిపెంట పరీక్షా కేంద్రంలో మాత్రం పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. ఫ్యాన్లు లేవు, విద్యుత్‌ సౌకర్యం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. 12 ఏళ్ల కిందట నిర్మించిన ఈభవన నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఇంజినీరింగ్‌ అధికారులు వినియోగించరాదని అప్పట్లోనే నిర్దారించారు.



కానీ స్థలాభావం వల్ల ఈ భవనాన్ని పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. 155 మంది పరీక్ష రాయనున్నారు. పి కోనవలస పరీక్షా కేంద్రంలో పాంచాళి, మక్కువ, పాచిపెంట కస్తూర్బా, పి.కోనవలస గురుకుల పాఠశాల విద్యార్థులు కలిపి మొత్తం 263 మంది పరీక్ష రాయనున్నారు.

 

కాపీయింగ్‌ సంగతేంటి?

సాలూరు: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పట్టణంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గాడివీధి హైస్కూల్, ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, లయన్స్‌క్లబ్‌ హైస్కూల్‌లో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, బెంచీలు తదితర సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కాపీయింగ్‌ సమస్య అధికారులను వేధిస్తుంది. ఆయా పాఠశాలల గదులను ఆనుకుని ఇళ్లు ఉన్నాయి.



స్లిప్పులను సులభంగా అందించే వీలుందని అధికారులు కలవరపడుతున్నారు. అలాగే గాడివీధి హైస్కూల్‌కు సమీపాన ప్రభుత్వ ఆస్పత్రిలోంచి స్లిప్పులు అందే అవకాశం ఉందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ సమస్య కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top