Breaking News

కరువు పేరుతో ధరల దరువు!

Published on Fri, 10/30/2026 - 05:34

సాక్షి, హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితులను బియ్యం వ్యాపారులు అవకాశంగా మలుచుకున్నారు. కరువు పేరు చెప్పి, గోదాముల్లో ఉన్న గత ఖరీఫ్‌ సీజన్‌ బియ్యానికే ధరలు రెట్టింపు చేశారు. కిలో రూ.50 నుంచి రూ.60 మించని బియ్యాన్ని రూ.90 నుంచి రూ.100, అంతకన్నా అధిక ధరలకు అమ్ముతున్నారు. మరీ దారుణం ఏంటంటే... చౌకధరల దుకాణాల ద్వారా వినియోగదారులు తీసుకున్న బియ్యాన్ని రూ.20 లోపు కిలో చొప్పున కొనుగోలు చేసి, అదే బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి రూ.80 నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. 

కరువు నేపథ్యంలో బియ్యానికి డిమా ండ్‌ పెరిగిందని ప్రచారం చేస్తూ,  మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, బియ్యం డిపోల యజమానులు కుమ్మక్కై  కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, పాలిష్‌ పట్టించి, పేరున్న బ్రాండ్ల సంచుల్లో నింపి సన్న బియ్యంగా డిపోలకు సరఫరా చేస్తున్నారు. పౌరసర ఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు గురువారం హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో ఈ దందా బట్టబయలైంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్‌ విభాగం, తూనికలు కొలతల శాఖ, జీఎస్‌టీ, పోలీసులతో ఉదయం 9 గంటల నుంచి 20 బృందాలతో దాడులు నిర్వహించి మిల్లర్లు, వ్యాపారుల గుట్టును రట్టు చేశారు.

క్వింటా రూ.5,400.. అమ్మేది రూ.10 వేలకు
⇒ గత ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన పంటకు సంబంధించి క్వింటాల్‌ బియ్యాన్ని రూ.4,000 నుంచి రూ.5000 వరకు విక్రయించారు. గత జూలై నెల వరకు కూడా బియ్యం ధర సుమారు రూ.5,400 నుంచి సూపర్‌ఫైన్‌ బియ్యం రూ.6000లోపే ఉంది. కానీ ఆ సీజన్‌ బియ్యం ఆగస్టు నుంచి ధర పెరుగుతూ వచ్చి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.9,000 నుంచి రూ.9,500లకు చేరింది. కొన్ని రకాలు కిలో రూ.55 నుంచి రూ.80–85కు చేరాయి. 

జై శ్రీరామ్‌ వంటి సన్నరకాలు కిలో రూ.100 దాటాయి. నగరంలోని మౌలాలిలో బుధవారం ఓ బ్రాండ్‌ సన్న బియ్యం కిలో రూ.101కి అమ్ముడైంది. హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌) రకాలు క్వింటా రూ.9 వేలు దాటాయి. హోల్‌సేల్, రిటైల్‌ ధరల మధ్యే కిలోకు రూ.5 నుంచి రూ.20 వరకు తేడా ఉంటోంది. జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్యే రాష్ట్రంలో బియ్యం చిల్లర ధరలు 13.3 శాతం పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

రేషన్‌ బియ్యానికి కొత్త రంగు
⇒ పౌరసరఫరాల శాఖ జరిపిన తనిఖీల్లో అత్యంత విస్తుపోయే అంశం రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రేషన్‌ కార్డుదారుల నుంచి రూ.15 నుంచి రూ.20కి  కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి, ఇబ్రహీంపట్నంలోని ఓ మిల్లుల్లో రీ సైక్లింగ్‌ చేసి, జైశ్రీరాం, కర్నూలు సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ పేర్లతో వివిధ బియ్యం బ్రాండ్‌ల 26 కిలోల సంచుల్లో నింపినట్టు తేలింది. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగల్‌పల్లి, శేరిగూడ, పోచారం, యాచారం ప్రాంతాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్‌ అయిన బియ్యం కార్పొరేట్‌ బ్రాండ్లను పోలిన పేర్లతో సంచుల్లో నింపి డిపోలకు పంపుతున్నారు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ తనిఖీల్లో మిల్లుల్లో ఉన్న బియ్యం సంచులే కర్మన్‌ఘాట్‌ బియ్యం డిపోల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు.

కర్మన్‌ఘాట్‌లో షట్టర్లు మూసి పరార్‌
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పరిధి కర్మన్‌ఘాట్‌లోని పలు బియ్యం డిపోలపై పౌరసరఫరాల, విజిలెన్స్‌ అధికారులు గురువారం బృందాలుగా ఏకకాలంలో దాడులు చేసి నిల్వలు, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రేషన్‌ బియ్యం కలిపారా లేదా తేల్చేందుకు పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అధికారులు వస్తున్నారని తెలియగానే కొందరు డిపోల నిర్వాహకులు షట్టర్లు దించి వెళ్లిపోయారు. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సరూర్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

26 కిలోల ట్యాగ్‌తో 25 కిలోల బియ్యం విక్రయాలు.. జీఎస్‌టీ ఎగవేత
బియ్యం తూకంలోనూ మిల్లర్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. సంచులపై 26 కిలోలు అని ట్యాగ్‌ వేసి లోపల 25 కిలోల బియ్యమే నింపుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరికొన్నిచోట్ల 25 కిలోల సంచుల్లో 23–24 కిలోలే ఉంటున్నాయని అధికారులు గుర్తించారు. 25 కిలోల బియ్యం సంచులకు జీఎస్‌టీ 5 శాతం చెల్లించాల్సి వస్తున్నందున 26 కిలోల ట్యాగ్‌ వేస్తే జీఎస్‌టీ ఉండదు. అమ్మకాలకు బిల్లులు ఇవ్వకుండా, లెక్కల్లో చూపకుండా జీఎస్టీ ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల మూడు జిల్లాల్లో బయటపడిన ఈ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్థాయిలో సాగుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)