చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
గుడ్‌న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గాయి!
Published on Fri, 11/06/2026 - 10:03
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు దీపావళి కానుకగా ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిత్యం మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఊరట కలిగించేలా ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గించింది.
ఇప్పటివరకు రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.400 ఉండగా.. దాన్ని రూ.275కు కుదించింది. అలాగే నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి ఏకంగా రూ.4,000కు తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే, తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అయితే, రోజువారీ పాస్ ధర తగ్గింపుతో ప్రయాణికులకు రూ.125 మేర ప్రయోజనం చేకూరనుంది. ఈ పాస్‌లో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. దీంతో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసేందుకు అనుమతి ఉంటుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం నిత్యం ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉండనుంది.
ఇక నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర తగ్గింపుతో వినియోగదారులకు ఏకంగా రూ.4,500 ఆదా కానుంది. రూ.8,500 చెల్లించాల్సిన పాస్ ఇకపై రూ.4,000కే అందుబాటులోకి రానుంది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.3,000, ఆర్టీసీ ప్రయాణానికి రూ.1,000 కేటాయించారు. నెలవారీ పాస్‌తో గరిష్టంగా 50 మెట్రో సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉంటుంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు విధించలేదు.

ఈ సందర్భంగా ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని వారు అన్నారు. ఈ క్రమంలో రోజువారీ, నెలవారీ పాస్‌ల ధరలు తగ్గించడంతో సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గనుంది. ముఖ్యంగా మెట్రో, ఆర్టీసీ సేవలను కలిపి వినియోగించుకునే ప్రయాణికులకు ఈ దీపావళి కానుక ఎంతో ఊరటనివ్వనుంది.
ఇదీ చదవండి: మార్గదర్శి, డాల్ఫిన్‌కు చుక్కెదురు
Tags : 1