విశాఖ MP భరత్ కు బిగ్ షాక్ ఏకమైన ఎమ్మెల్యేలు
Breaking News
అతిగా అన్నం తినడమూ వ్యసనమే!
Published on Tue, 08/18/2026 - 07:49
మనదేశంలో ముఖ్యంగా దక్షిణాది భోజనంలో అన్నం ప్రధానమైనది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ప్రతి పూట కంచంలో గుప్పెడు అన్నం పడందే చాలామందికి కడుపు నిండిన భావనే రాదు. ఈ ఒక్కమాటను గమనించాలి, ‘కడుపు నిండడం కాదు కడుపు నిండిన భావన’. మోతాదుకు మించి అన్నం తినే అలవాటు ఉంటే అది కేవలం ఆకలి మాత్రమే కాదని, ఇదొక రకమైన ’కార్బోహైడ్రేట్ వ్యసనం’ కావచ్చని ఆధునిక ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అన్నం వ్యసనంగా ఎలా మారుతుంది?
అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అన్నం కడుపులోకి వెళ్లగానే గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనివల్ల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ప్రేరేపితమై డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ తాత్కాలికంగా మనకు ఒక రకమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ సంతోష స్థాయిలు, శక్తి తగ్గిపోతాయో, మెదడు మళ్లీ అదే స్థాయి ఆనందం కోసం తక్షణ శక్తినిచ్చే అన్నం కోసం డిమాండ్ చేస్తుంది. ఇదే చక్రం పునరావృతమై క్రమంగా అది అన్నం తినాలనే బలమైన కోరికగా మారుతుంది. ఈ బలహీనతను పరిశోధకులు కార్బ్ క్రేవింగ్(పిండి పదార్థాలు లేదా తీపి పదార్థాలను మళ్లీ మళ్లీ తినాలనే తీవ్రమైన కోరిక) అంటున్నారు.
పరిశోధకుల మాటల్లో...
పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ కిస్ ‘తెల్లటి అన్నం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మెదడులోని డోపమైన్ మార్గాలను మాదకద్రవ్యాల మాదిరిగానే ఉత్తేజపరుస్తాయి. అందుకే చాలామందికి ఇతర ఆహారాలతో కడుపు నిండినప్పటికీ, మనసు సంతృప్తి చెందక అన్నం తిని సంతృప్తి చెందుతారు. ఇది శారీరక ఆకలి కాదు, మెదడు కోరుకునే వ్యసనం’అన్నారు.
బిహేవియరల్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ నికోల్ ఏ.వియెరా ‘మన సాంస్కృతిక ఆహారపు అలవాట్లలో అన్నం ఒక భాగం. ఒత్తిడిని తట్టుకోవడానికి ఇదొక స్ట్రెస్‌బస్టర్, మానసిక ప్రశాంతత కోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నంపై ఆధారపడటం అలవాటుగా మారితే అది మానసిక బానిసత్వానికి దారితీస్తుంది. దీన్ని తగ్గించాలని ప్రయత్నించినప్పుడు కొందరిలో ఆందోళన, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పూర్తిగా వ్యసన లక్షణమే’అన్నారు.
ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలు?
మధుమేహం ముప్పు: అన్నాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయి లు అకస్మాత్తుగా పెరిగి, కాల క్రమేణా టైప్–2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
బరువు పెరగడం: అన్నంలో కేలరీలు ఎక్కువ, పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది.
నీరసం, అలసట: రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవడం వల్ల భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలసట, నిద్రమత్తు ఆవహిస్తాయి.
ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?
క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా అన్నం మానేయకుండా, క్రమంగా పరిమాణాన్ని తగ్గించుకోవాలి.
ప్రత్యామ్నాయాలు: వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, తృణధాన్యాలు వాడటం మంచిది.
- సాక్షి, స్పెషల్ డెస్క్
Tags : 1