Breaking News

లోకాయుక్తగా జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి

Published on Sun, 04/06/2025 - 06:23

సమాచార కమిషనర్ల ఎంపిక వాయిదా సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా మరో రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ను నియమించాలని నిర్ణయం తీసుకుంది. 

శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్‌ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరిద్దరి పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది. ఉప లోకాయుక్తగా బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ జిల్లా జడ్జి పేరును ఖరారు చేసినట్టు సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్తతోపాటు హెచ్‌ఆర్సీ చైర్మన్‌ పేరును ఖరారు చేసింది. 

వీరి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం శనివారమే రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ ఆమోదం లభించాక ఒకట్రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. లోకాయుక్తగా నియామకం కానున్న జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డిని 2024 జూన్‌లో ప్రభుత్వం తెలంగాణ ‘రెరా’ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ చైరపర్సన్‌గా నియమించింది. ఆయన ఈ పోస్టుకు రాజీనామా చేసి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో ప్రభుత్వం ఇటీవల ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. 

సమాచార కమిషనర్ల ఎంపికపై.. 
రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై చర్చించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల ఎంపికను వాయిదా నట్టు తెలిసింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్‌ రావాల్సి ఉండగా, ఆయన దూరంగా ఉన్నారు. 

దీర్ఘకాలంగా ఖాళీలు 
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ బి.సుభాషణ్‌ రెడ్డి 2017 అక్టోబర్‌ 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి 2017 డిసెంబర్‌ 16న పదవీ విరమణ చేయగా, నాటి నుంచి పోస్టును భర్తీ చేయలేదు. హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, సభ్యులు (జ్యుడీషియల్‌) ఆనంద రావు, సభ్యులు (నాన్‌ జ్యుడీషియల్‌) ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌ 2022 డిసెంబర్‌ 22న పదవీ విరమణ చేయగా, నాటి నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ప్రధాన సమాచార కమిషనర్‌ పోస్టు 2022 సెప్టెంబర్‌ నుంచి, సమాచార కమిషనర్ల పోస్టులు 2023 ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను సుదీర్ఘ కాలంగా భర్తీ చేయకపోవడంతో సమాచార కమిషన్‌లో గతేడాది చివరి నాటికి 10,688 అప్పీల్స్‌ పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ పోస్టులను సత్వరంగా భర్తీ చేయాలని గతంలో హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేసింది.  

జస్టిస్‌ ఏ.రాజశేఖర్‌రెడ్డి ప్రొఫైల్‌ 
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం పొందారు. 1985, ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. తొలుత మహమూద్‌ అలీ వద్ద ప్రాక్టీస్‌ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొదలెట్టారు. 

2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం (హెచ్‌సీఏఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, 2005లో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్‌ టాక్స్‌కు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా కూడా పని చేశారు. 2013, ఏప్రిల్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022, ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. 

జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ప్రొఫైల్‌ 
1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్‌ మహమ్మద్‌కు జన్మించారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్‌ చదివారు. నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996లో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు. 

2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్‌ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2022 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)