Breaking News

దశల వారీగానే మాఫీ!

Published on Mon, 06/17/2024 - 00:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీ­గా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని.. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను, తర్వాత రూ. 75 వేల వరకు, అనంతరం రూ.లక్ష.. ఇలా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి రూ.లక్ష లోపే రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలిదశలో మాఫీ చేసి.. తర్వాత మిగతా వారికి అమలు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్నిరకాల మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నాయి. 

నాలుగు పథకాలకు రూ.50 వేల కోట్లు! 
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ నిధులు సమీకరించడం సవాల్‌గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసా కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల మేరకు కావాలి. రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించేందుకు రూ.1,500 కోట్లు కావాలి. 

పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు రూ.2,500 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా ఈ నాలుగింటికి కలిపి రూ.50 వేల కోట్ల వరకు అవసరం. రైతుభరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలి. అంటే ఈ రెండు నెలల్లోనే నిధులన్నీ సమకూర్చుకోవాలి. 

భారం తగ్గించుకోవడంపై దృష్టి! 
భారీగా నిధుల అవసరం ఉండటంతో.. ఈ నాలుగు పథకాల భారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు తీరును పరిశీలించింది. వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రుణమాఫీ అమలుతీరును అధ్యయనం చేసి వచ్చారు. రాజస్తాన్‌లో రుణమాఫీ అమలుతీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. అర్హులైన రైతులకు లబ్ధిచేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు కొనసాగుతోంది. నిజానికి రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీయిచ్చింది. 

కానీ ఆయా పథకాలకు అర్హులను గుర్తించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించింది. 

ఇప్పుడు ‘‘రైతు భరోసాకు, రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? అలా చేస్తే అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి?’’ అన్నదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంటే పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పీఎం కిసాన్‌లో మినహాయింపు ఉన్న వర్గాలతోపాటు ఐదెకరాల పరిమితి పెట్టడం, సాగుచేసే రైతులకే భరోసా సాయం ఇవ్వడం వంటివి అమలు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రుణమాఫీకి కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచన సాగుతున్నట్టు సమాచారం. 

నిధుల సమీకరణ ఎలా? 
ఈ నాలుగు పథకాల కోసం ఒకేసారి రూ.50 వేల కోట్ల మేరకు నిధులు సమీకరించడం అంత సులువైన వ్యవహారం కాదని.. ఒకవేళ ఆంక్షలు విధించి, కోతలు పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము సేకరణ కష్టమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే, నిధుల సమీకరణకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ‘రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న ఆలోచన జరుగుతోంది. 

అయితే ఏదైనా కార్పొరేషన్‌కు భారీగా రుణం ఇవ్వాలంటే.. దానిని అదే సంస్థ తిరిగి చెల్లించగలదంటూ ఆదాయ మార్గాలను చూపాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదైనా సంస్థ లేదా పథకం పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణం సొమ్మును ఆ పనికి మాత్రమే వినియోగించాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లకుండా చూడాలని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోంది. 

వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 700 ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం గుర్తించింది. అందులో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రూ.20 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)