సాహో అర్జెంటీనా

Published on Fri, 07/17/2026 - 03:44

జగజ్జేత జట్టు ఆట ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు మరోసారి ప్రపంచానికి చూపించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరడం... ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటం... ప్రత్యర్థి జట్ల ఆశలను చివరి క్షణాల్లో గల్లంతు చేయడం... ఏ లక్ష్యంతోనైతే అడుగు పెట్టామో దానిని ఎలా సాధించాలో ... తమను చూసి నేర్చుకోవాలని అర్జెంటీనా చాటి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్‌కు మూడోసారి కూడా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పీడకలగా మారిపోయింది. ఆధిక్యంలో ఉన్నామన్న ధీమాతో... మేటి జట్లను తక్కువ అంచనా వేస్తే చివరకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లండ్‌కు మరోసారి అనుభవమైంది.   

అట్లాంటా: వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. భారత  కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ముగిసిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా 2–1 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది. అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్‌ (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్‌ లాటారో మార్టినెజ్‌ (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఇంగ్లండ్‌ జట్టుకు ఆంథోనీ గోర్డాన్‌ (55వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. 

కెప్టెన్ మెస్సీ అందించిన పాస్‌లతోనే అర్జెంటీనా రెండు గోల్స్‌ నమోదు చేయడం విశేషం. 85వ నిమిషం వరకు 0–1తో వెనుకబడిన అర్జెంటీనా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి మరో అద్భుతం నమోదు చేసింది. ఈజిప్ట్ తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 0–2తో వెనుకబడ్డాక 13 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా మూడు గోల్స్‌ కొట్టి అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే.  

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి న్యూజెర్సీ వేదికగా జరిగే ఫైనల్లో ప్రస్తుత యూరోపియన్‌ చాంపియన్, 2010 ప్రపంచకప్‌ విజేత స్పెయిన్‌ జట్టును అర్జెంటీనా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో అర్జెంటీనా విజయం సాధిస్తే... ఇటలీ (1934, 1938), బ్రెజిల్‌ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ టైటిల్స్‌ గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా, మూడుసార్లు (1930, 1990, 2014)  రన్నరప్‌గా నిలిచింది.  

సెమీఫైనల్‌ చేరుకునే క్రమంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన అర్జెంటీనా కీలక సమరంలోనూ సత్తా చాటింది. 55వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్‌ సమర్పించుకున్న అర్జెంటీనా ఆ తర్వాత అసలు సిసలు ఆటతీరును కనబరిచింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్‌ మెస్సీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. 

అవకాశం దొరికినపుడల్లా ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌ దిశగా దూసుకెళ్లాడు. 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఇంగ్లండ్‌ మరీ రక్షణాత్మకంగా ఆడింది. ఎలాగైనా అర్జెంటీనాను గోల్‌ చేయనీకుండా నిలువరించాలన్న ధ్యేయంతో కనిపించింది. గోల్‌కీపర్‌తో కలిపి రక్షణశ్రేణిలో తొమ్మిది మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కనిపించారు. మరోవైపు స్కోరును సమం చేయాలన్న కసితో అర్జెంటీనా దాడుల్లో పదును పెంచింది. రెండుసార్లు దాదాపు గోల్‌ అయినట్లే కనిపించింది. ఇంగ్లండ్‌ గోల్‌కీపర్‌ పిక్‌ఫర్డ్‌ అప్రమత్తతతో రెండుసార్లు గోల్‌ కాకుండా నిలువరించాడు. 

69వ నిమిషంలో నికో గొంజాలెజ్‌ షాట్‌ను... 76వ నిమిషంలో మాక్‌ అలిస్టర్‌ షాట్‌ను పిక్‌ఫర్డ్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత అలిస్టిర్‌ కొట్టిన షాట్‌ ఒకటి ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. ఓవరాల్‌గా 55 నిమిషం నుంచి 85వ నిమిషం వరకు బంతి అర్జెంటీనా ఆధీనంలో 88 శాతం, ఇంగ్లండ్‌ ఆ«దీనంలో 12 శాతం ఉండటం గమనార్హం. ఎట్టకేలకు 85వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేయడంలో సఫలమైంది. మెస్సీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్‌  కళ్లు చెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 

ఆ తర్వాత 90+2 నిమిషంలో మెస్సీ అందించిన క్రాస్‌ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల ఇద్దరు ఇంగ్లండ్‌ డిఫెండర్లకంటే ఎత్తుకు ఎగిరిన మార్టినెజ్‌ హెడర్‌ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. స్టాపేజ్‌ సమయంలోని మిగిలిన సమయంలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి అర్జెంటీనా ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో ఇంగ్లండ్‌ కేవలం ఐదుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌లు కొట్టింది. 

ఈ టోర్నీలో ఆరు గోల్స్‌ చొప్పున కొట్టి నిలకడగా రాణించిన ఇంగ్లండ్‌ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్‌ బెలింగ్‌హమ్‌ కీలకమైన సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయారు. 1966లో చివరిసారి ఫైనల్‌ చేరి టైటిల్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత మూడుసార్లు (1990, 2018, 2026) సెమీఫైనల్లో ఓడిపోయింది.  

19 ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్జెంటీనా చేసిన గోల్స్‌. ఒకే ప్రపంచకప్‌లో అర్జెంటీనా సాధించిన అత్యధిక గోల్స్‌ ఇవే కావడం విశేషం. 1930 లో అర్జెంటీనా  18 గోల్స్‌ నమోదు చేసింది.

6 ప్రపంచకప్‌ చరిత్రలో అర్జెంటీనా ఆడిన ఆరు సెమీఫైనల్స్‌లోనూ (1930, 1986, 1990, 2014, 2022, 2026) నెగ్గింది. అర్జెంటీనా తొలిసారి విజేతగా నిలిచిన 1978 ప్రపంచకప్‌ లో సెమీస్‌ జరగలేదు. 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభ జించారు. గ్రూప్‌ విన్నర్స్‌గా అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ ఫైనల్లో ఆడాయి.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)