Breaking News

ఉద్యమ కెరటం అస్తమించింది.. ముద్రగడకు వీడ్కోలు

Published on Thu, 07/16/2026 - 11:13

ఒక ఉద్యమ కెరటం ఆగిపోయింది.. ఒక ఆత్మీయ అనుబంధం తెగిపోయింది. మాటకు, పట్టుదలకు మారుపేరు అయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురై మరణించడం అందరిని కలచివేస్తుంది. ముద్రగడ కాపు ప్రజల కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గానికి చాలా మేలు చేశారు కాని, తాను మాత్రం రాజకీయంగా నష్టపోయారని చెప్పాలి. ఎవరు కాపుల ప్రయోజనాలకోసం కృషి చేశారో, చేస్తారో తెలుసుకునే టైమ్‌కి ముద్రగడ కన్ను మూయడం దురదృష్టకరం.

ఆయన కాపు సామాజికవర్గ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా, ఇతర సామాజికవర్గాలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని సామాజికవర్గ నేతలు అతి తక్కుమంది ప్రభావం చూపించారు. వారిలో ముద్రగడ అగ్రగణ్యుడుగా ఉన్నారు. కాపులు పేరుకు అగ్రవర్ణం అయినా, పేదల శాతం ఎక్కువగా ఉంది. వారిని ఆకర్షించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పలు హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలు అయింది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని కోరుతూ 2014-19 టరమ్‌లో ముద్రగడ నడిపిన ఉద్యమం ఏపీని కుదిపివేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ఉద్యమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, రకరకాల నిరసన పద్దతులను అవలంబించి ముద్రగడ చరిత్ర సృష్టించారు. మహిళలతో సహా కాపువర్గం వారంతా పళ్లాలతో నిరసన తెలుపుతూ చేపట్టిన ఆందోళన ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. తుని వద్ద ఆయన జరిపిన సభకు వేలాదిగా ఆ సామాజికవర్గ ప్రజలు స్వచ్చందంగా తరలివెళ్లడం ఒక చరిత్ర. అనూహ్యంగా తుని వద్ద రైలు దగ్దం ఘటనతో ఆయనతో సహా అనేక మంది ఉద్యమకారులపై కేసులు వచ్చినా చలించలేదు.

టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. తన కుటుంబ సభ్యులపై పోలీసులతో బూతులు తిట్టించారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలుమార్లు బాధపడ్డారు. ఆయనను రాజమండ్రి ఆస్పత్రిలో నిర్బంధించి ఎవరిని కలుసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని ఆయన చెబుతుండేవారు. రైతులకు సమస్య వచ్చినా, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టినా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలకు దిగేవారు. ఉత్తరకంచి గ్రామంలో జరిగిన ఒక ఘటనపై ఆయన దీక్ష చేయడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కొన్నిసార్లు తన ఇంటిలోనే తలుపులు వేసుకుని దీక్ష చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్‌లో కూడా ఆయన కాపుల డిమాండ్లపై దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయన ఆ పార్టీలోనే ఉన్నా ప్రజల కోసం ఉద్యమించడానికి ముందుండేవారు.

కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి రోశయ్యను హెలికాఫ్టర్‌లో పంపించి ముద్రగడతో రాయబారం చేసి కాపులకు పలు వరాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ తర్వాత లక్షల మందితో ఒక సభను పెడితే కోట్ల స్వయంగా హాజరయ్యారు. కొన్నిసార్లు అవసరమైతే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకోవడానికి కూడా ఆయన వెనుకాడేవారు కారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన పద్మనాభం 1978 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. గతంలో జనతా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు.

ముద్రగడను హైదరాబాద్ పంపి, ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోలుకోవడం కోసం జగన్ ఎంతో కృషి చేసినా అది ఫలించలేదు. ముద్రగడ ఆత్మీయత అనేది ఒక అరుదైన అనుభవం. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లడానికి ఒప్పుకునేవారు కారు. నిత్య సంతర్పణ మాదిరిగా ఇంటి వద్ద కోలాహలం ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. రాజకీయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ వదలుకోలేదు. తనను నమ్ముకున్నవారిని వదలిపెట్టలేదు. ఆయా సందర్భాలలో ప్రభుత్వ నేతలకు లేఖలు రాసి తన అభిప్రాయాలను చెబుతుండేవారు.

చంద్రబాబుకు ఆ లేఖలు బాగా చికాకు పెట్టించేవి. ముద్రగడ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయేవారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే, జగన్ ప్రభుత్వం కాపు నేస్తంతో సహా పలు పథకాలను వారి సంక్షేమం కోసం అమలు చేసింది. తద్వారా కాపులకు కూడా ఇతరవర్గాలతో పాటు మేలు చేసిన వ్యక్తిగా జగన్‌ను ఆయన గుర్తించారు. జగన్ కూడా ఆయనను పితృ సమానుడుగా చూశారు. తన సంతాప సందేశంలో అదే విషయం పేర్కొన్నారు. జనసేనకు చెందిన ఒక ప్రముఖ నేత గత ఎన్నికల ముందు ఆయన ఇంటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయన తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఆయన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ చాలా బాధపడ్డారు. మాటపై నిలబడడం కాని, పట్టుదలకు కాని ముద్రగడ పెట్టింది పేరు.

గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి ఓటమి ఎదురుకాదని ఆయన విశ్వసించారు. అలా జరిగితే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. సాధారణంగా రాజకీయాలలో ఇలాంటి సవాళ్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత వాటిని విస్మరిస్తుంటారు. కాని ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా తన పేరును పద్మనాభరెడ్డి అని గెజిట్‌లో నమోదు చేయించుకోవడం విశేషం. తన కుమార్తె జనసేనలో చేరి తనపైనే విమర్శలు చేసిన తీరు ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. తాను మరణిస్తే ఆమెను రానివ్వద్దని అన్నారంటే ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

ముద్రగడ పార్ధీవదేహం చూడడానికి వచ్చిన ఆమెను కుటుంబ సభ్యులు అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంచనాలతో చేయడానికి ముందుకు వచ్చినా వారు అంగీకరించలేదు. జీవించి ఉన్నప్పుడు ముద్రగడను ఎన్నో బాధలుపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ముద్రగడ ఏపీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఏభై ఏళ్లలో కాపు సామాజికవర్గానికి ఇంతగా గుర్తింపు తెచ్చిన నేత ముద్రగడ తప్ప మరోకరు కాదని చెప్పాలి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)