ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్
Breaking News
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Published on Mon, 07/27/2026 - 12:06
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.
ఈ విచారణలో జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్‌ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
Tags : 1