Breaking News

జలాంతర్గామిలో ముర్ము విహారం 

Published on Sun, 12/28/2025 - 15:12

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌’ జలాంతర్గామిలో ప్రయాణించారు. తద్వారా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం తర్వాత జలాంతర్గామిలో పయనించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము రికార్డు సృష్టించారు. ఆదివారం కర్ణాటకలోని కర్వార్‌ నావికా స్థావరం ఇందుకు వేదికైంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన కల్వరీ శ్రేణి అత్యాధునిక ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ జలాంతర్గామిలో ఆదివారం ప్రయాణించారు.

 నావికా దళాధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వాఘ్‌షీర్‌లో ముర్ము రెండు గంటలపాటు గడిపారు. జలాంతర్గామి పనితీరు గురించి అధికారులను ఆమె స్వయంగా అడిగి తెల్సుకున్నారు. అనంతరం జలాంతర్గామి సిబ్బందితో రాష్ట్రపతి సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె నావికా దళ యూనిఫాం ధరించి ఆకట్టుకున్నారు.
 
స్ఫూర్తినిచ్చింది: మేడిన్‌ ఇండియా సాఫల్యానికి తార్కాణమైన ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లో పయనించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ముర్ము పేర్కొన్నారు. ప్రయాణానంతరం అందులోని అతిథుల పుస్తకంలో ముర్ము తన మనోభావాలకు అక్షర రూపమిచ్చారు. ‘‘జలాంతర్గామిలోకి ప్రవేశం, అందులో ప్రయాణం, సాహసికులైన నావికులు, నావికాధికారులతో విలువైన సమయం గడపడం నాకు మరపురాని అనుభూతిగా మిగిలిపోతాయి.

 ‘వీర వర్చస్వ విజయ’ అన్న స్వీయ స్ఫూర్తి వాక్యాన్ని ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ నిత్యం నిజం చేసి చూపుతూ వస్తోంది. ఎన్నో సాహస కార్యాలను విజయవంతంగా నెరవేర్చింది. దాని సిబ్బంది నిరంతర అప్రమత్తత, అంకితభావం అబ్బురపరుస్తున్నాయి. వారి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నాలోనూ మరెంతో స్ఫూర్తి నింపాయి. మన జలాంతర్గాములు, నావికా దళం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నిత్యం సన్నద్ధంగా ఉన్నాయని మరోసారి వాఘ్‌షీర్‌ సిబ్బంది చాటారు’’ అంటూ ఆమె కొనియాడారు.

 త్రివిధ దళాలతో సుప్రీం కమాండర్‌ తరచూ భేటీ అవుతూ స్ఫూర్తి నింపుతున్న క్రమానికి ఇది కొనసాగింపు అని రాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. మన నావికా దళ వృత్తి నిబద్ధతకు, అద్భుత పాటవానికి, నిరంతర యుద్ధ సన్నద్ధతకు వాఘ్‌షీర్‌ జలాంతర్గామి అద్భుత ప్రతీక అని రాష్ట్రపతి కొనియాడినట్లు ఆ ప్రకటన పేర్కొంది. 2024 నవంబర్‌లో ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధ విమానంలో ప్రయాణించడం తెలిసిందే. 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలాంతర్గామిలో ప్రయాణించారు.

‘నిశ్శబ్ద’ కెరటం 
ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ను నావికా దళం గర్వంగా ‘నిశ్శబ్ద కెరటం’గా పేర్కొంటూ ఉంటుంది. పీ75 స్కార్పీన్‌ ప్రాజెక్టులో ఇది ఆరో, చివరి జలాంతర్గామి. గత జనవరిలో నావికా దళానికి అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సదుపాయాలు దీని సొంతం. ప్రపంచంలోనే వేళ్లపై లెక్కించగల డీజిల్‌–ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్లలో వాఘ్‌షీర్‌ ఒకటి అని నేవీ అధికారులు తెలిపారు. యాంటీ సబ్‌మెరైన్‌తో పాటు యాంటీ సర్ఫేస్‌ యుద్ధ తంత్రంలోనూ దీనికి తిరుగులేదు. నిఘా, సమాచార సేకరణతో పాటు పలు ప్రత్యేక రహస్య ఆపరేషన్లను ఇది నిశ్శబ్దంగా చక్కబెడుతుంటుంది. వైర్‌ గైడెడ్‌ టోర్పెడోలు, యాంటీ షిప్‌ క్షిపణులు, అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలు వాఘ్‌షీర్‌ సొంతం. ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) టెక్నాలజీ సాయంతో దీని భావి ఆధునీకరణలకు కూడా పూర్తిస్థాయిలో వీలుండటం విశేషం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)