చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
మరో నీట్ విద్యార్థిని బలవన్మరణం.. 10 పేజీల లేఖలో..
Published on Tue, 11/03/2026 - 09:25
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ‘నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. పరీక్షలో విజయం సాధించలేననే ఆందోళనతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రయాగ్‌రాజ్ జిల్లా ఝూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని త్రివేణీపురంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని తండ్రి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)లో రిటైర్డ్ ఇంజినీర్. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిద్రపోయే అలవాటున్న ఆమె.. మధ్యాహ్నం 3 గంటలైనా గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రి లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.
లేఖలో కుటుంబ సభ్యులకు క్షమాపణలు
ఘటనా స్థలంలో పోలీసులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. నీట్ పరీక్షలో తాను ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేనని, తనను క్షమించాలని అందులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరీక్షలో ఎదురవుతున్న వైఫల్యాల కారణంగా ఆమె తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తున్నది. విద్యార్థిని వద్ద మొత్తం 10 పేజీల లేఖ లభించింది. అందులో రెండు పేజీలను కొట్టివేయగా, మిగిలిన ఎనిమిది పేజీల్లో తన ఆలోచనలు, చదువు, భవిష్యత్తు గురించి రాసినట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రస్తావించింది. మానసిక ఒత్తిడి, ఓసీడీ, డిప్రెషన్‌కు సంబంధించిన సమస్యల గురించి కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ (సిటీ) సాగర్ జైన్ తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించాలనే ఒత్తిడి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అయితే పరీక్షల్లో ఆశించిన ఫలితం రాకపోవడం జీవితంలో వైఫల్యంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు కుటుంబ సభ్యుల మద్దతు, స్నేహితుల సహకారం. అవసరమైన మానసిక ఆరోగ్య నిపుణుల సలహా ఎంతో కీలకం.
ఇదీ చదవండి: అయ్యప్ప భక్తుల కోసం చెంగన్నూర్ రైల్వే స్టేషన్ ముస్తాబు!
Tags : 1