Breaking News

వెరీ స్ట్రాంగ్‌ ఎల్‌ నినో.. జులైలో ఏప్రిల్‌-మే ఎండలు!

Published on Mon, 07/13/2026 - 08:37

జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్‌, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్‌ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే నెలల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్‌ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (NOAA) హెచ్చరించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య 81 శాతం అవకాశంతో 'వెరీ స్ట్రాంగ్‌ ఎల్‌ నినో'గా మారవచ్చని తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ పరిణామం భారత్‌లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలోని నినో Niño-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్‌ ఎల్‌ నినో దశలో ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉందని NOAA పేర్కొంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్‌ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్‌ ఎల్‌ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్‌ ఎల్‌ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్‌-డిసెంబర్‌ నాటికి ఇది 'వెరీ స్ట్రాంగ్‌ ఎల్‌ నినో' స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని NOAA అంచనా వేస్తోంది.

ఈసారి ఎల్‌ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని పుణేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరాలజీ (IITM) శాస్త్రవేత్త డాక్టర్‌ రాక్సీ మాథ్యూ కోల్‌ వివరించారు. తూర్పు పసిఫిక్‌లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్‌ విండ్‌లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్‌ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్‌లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర ప్రకారం.. గతంలో నమోదైన బలమైన ఎల్‌ నినో సంవత్సరాల్లో 60 శాతం సందర్భాల్లో సాధారణం కంటే తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం సీజన్‌లో కూడా దీర్ఘకాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

ఎల్‌ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణలో జులై రెండో వారంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవగా, కోస్తా జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

అయితే ఎల్‌ నినో అంటే కేవలం వర్షాభావమే కాదు. సముద్రాల వేడి పెరగడం వల్ల గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంటే, మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వాతావరణం మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ప్రపంచం చూసింది. 2015-16లో నమోదైన 'గాడ్జిల్లా ఎల్‌ నినో' ప్రపంచవ్యాప్తంగా వాతావరణ రికార్డులను బద్దలు కొట్టింది. 

భారత్‌లో 2014, 2015 సంవత్సరాలు ఈ శతాబ్దంలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంవత్సరాలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే స్థాయిలో తీవ్రత పెరిగితే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు, విద్యుత్‌ ఉత్పత్తి, ఆహారధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOAA అంచనా ప్రకారం ప్రస్తుత ఎల్‌ నినో 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97 శాతం ఉంది. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టంతా పసిఫిక్‌ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిణామాలపైనే నిలిచింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)