వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
Breaking News
మౌనం వీడిన జనరల్ నరవణే.. ఏమన్నారంటే..
Published on Wed, 02/11/2026 - 07:11
న్యూఢిల్లీ: తన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రచురణకు సంబంధించి గత కొద్దిరోజులుగా సాగుతున్న వివాదంపై మాజీ సైన్యాధిపతి జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణే ఎట్టకేలకు స్పందించారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ఇచ్చిన వివరణను ఆయన సమర్థించారు. ఒక పుస్తకాన్ని ప్రకటించడం లేదా ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచడం అంటే అది పబ్లిక్ రిలీజ్ అయినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రచురణకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ను ఆయన షేర్ చేస్తూ, వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు ఆవరణలో ఈ పుస్తకానికి సంబంధించిన కాపీని ప్రదర్శించడమే కాకుండా, 2023లో నరవణే చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ప్రచురణ సంస్థ, పుస్తక ప్రచురణ ప్రక్రియ గురించి వివరించింది. ఒక పుస్తకాన్ని ప్రకటించడం అంటే భవిష్యత్తులో దానిని తీసుకురాబోతున్నామని చెప్పడమే తప్ప, అది అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదని స్పష్టం చేసింది. రిటైలర్లు, పాఠకుల సౌకర్యార్థం ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం అనేది ప్రచురణ రంగంలో సాధారణ పద్ధతి మాత్రమేనని తెలిపింది.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్‌లోకి రాకముందే దాని మాన్యుస్క్రిప్ట్ డిజిటల్, ఇతర రూపాల్లో అక్రమంగా చలామణి అవుతుండటంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించి తమకు మాత్రమే ప్రచురణ హక్కులు ఉన్నాయని, అనుమతి లేకుండా పిడిఎఫ్ లేదా ముద్రిత రూపంలో పంపిణీ చేయడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచురణకర్త హెచ్చరించారు.
గత వారం పార్లమెంటులో రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని చూపిస్తూ, చర్చకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభలో ఈ ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించాలని ఆయన భావించినప్పటికీ, పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదనే కారణంతో ఆయనను అడ్డుకున్నారు. పుస్తకం రిటైల్ ఛానళ్లలో అందుబాటులోకి వచ్చినప్పుడే అది ప్రచురితమైనట్లు పరిగణించాలని ప్రచురణ సంస్థ స్పష్టం చేయడంతో, రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
ఇది కూడా చదవండి: ‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ
Tags : 1