రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్
Breaking News
శతమానం భారతి.. లక్ష్యం 2047
Published on Wed, 06/01/2022 - 18:38
భారతదేశ ఆర్థిక వ్యవస్థను రెండు ప్రధాన దశలుగా పరిగణించాలి. ఒకటి 1947 నుంచి 1990 వరకు. రెండవది 1991లో మొదలైన అర్థిక సంస్కరణలు, సరళీకరణల దశ. తొలి దశలో బ్రిటిష్ పాలకుల వల్ల క్షీణించిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు జవహర్‌లాల్ నెహ్రూ పారిశ్రామికీకరణపై భారీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు.
1991లో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీవీ నరసింహారావు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించి మూలధనాన్ని సమీకరించడం, సాధారణ ప్రజలకు సైతం ఆ వాటాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి తోడ్పడింది. కోవిడ్ ప్రభావం వల్ల ఈ రెండేళ్లలో కొన్ని ఒడిదుడుకులు సంభవించినప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు.
చదవండి: (దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు)
2021లో దేశం ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంది. 1991 జూలై 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ రోజును నేటికీ కొందరు ఆర్థిక వేత్తలు భారతదేశ ఆర్థిక స్వాతంత్య్ర దినంగా అభివర్ణిస్తున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచడం, లైసెన్సింగ్ రాజ్‌ను ముగించడం, కంపెనీలకు పర్మిట్ల నుంచి విముక్తి కల్పించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు వంటి లక్ష్యాలతో నాటి బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది.
సాఫ్ట్‌వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్‌హెచ్‌సి కింద పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ఇవన్నీ ఈ ముప్పై ఏళ్లలో అనేక సత్ఫలితాలను ఇచ్చాయి. రానున్న 25 ఏళ్లలో ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రస్తుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Tags : 1