దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్
Breaking News
Bharat Jodo Yatra: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆటలు సాగనివ్వం
Published on Tue, 09/20/2022 - 04:44
అలప్పుజా: అధికార బీజేపీ దేశంలో విద్వేషం, హింసాకాండను ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించాలన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుటిల సిద్ధాంతాలను అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని చెర్తాలాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
హింసాద్వేషాలను నమ్ముకుంటే దేశం ప్రగతి సాధించలేదని మరోమారు స్పష్టం చేశారు. అరాచక పాలన వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న నిజాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమా? కొత్త ఆసుపత్రులు నిర్మించగలమా? కొత్త రోడ్లు వేయగలమా? మన పిల్లలను విద్యావంతులను చేయగలమా? అని రాహుల్ ప్రశ్నించారు.
ఎంతమాత్రం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సామాన్య ప్రజలు తమ భుజస్కందాలపై ఈ దేశాన్ని మోస్తున్నారని, కొందరు దుష్టులు సృష్టిస్తున్న ద్వేషాల వల్ల జనమే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు మన దేశంలో ఉన్నారని, అదే సమయంలో నిత్యావసరాల కోసం మన ప్రజలు అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్న దేశం, ధరల మంటలు మండుతున్న దేశం మనకు కావాలా? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలనలో సామాన్యులు రోజురోజుకూ చితికిపోతుంటే బడాబాబులు మాత్రం మరింత ధనవంతులవుతున్నారని ఆక్షేపించారు. రాహుల్ పాదయాత్ర సోమవారం 12వ రోజుకు చేరుకుంది. అలప్పుజలోని వడక్కల్ బీచ్‌లో మత్స్యకారులను కలుసుకున్నారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వెంబనాడ్ సరస్సులో ఓ హౌస్‌బోటులో పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు. స్నేక్ బోటు రేసింగ్‌లో పాల్గొన్నారు. 50 మంది యువకులతో కలిసి కాసేపు పడవ నడిపించారు.
Tags : 1