ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
సీఎం విజయ్ కొడుకు తొలి సినిమా ‘సిగ్మా’ రివ్యూ అండ్ రేటింగ్
Published on Fri, 10/02/2026 - 16:11
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడం..హీరో, హీరోయిన్లతో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ఈ డబ్బింగ్ సినిమాపై తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
గురు(సందీప్ కిషన్).. అమ్మకు గుర్తుగా లైబ్రరీ నడుపుతూ..అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడుతుంటారు. యూట్యూబ్‌లో ఆడియో బుక్ లాంచ్ చేస్తాడు. దానికి ఆర్జే సామ్ (ఫరియా అబ్దుల్లా) వాయిస్ అందిస్తుంది. కొద్ది కొద్దిగా డబ్బులు చేతికి అందుతున్న తరుణంలో.. కోటి రూపాయలకు పైన ఉన్న అప్పుని వెంటనే కట్టమని అప్పు ఇచ్చినవాడు ఒత్తిడి చేస్తారు. దీంతో యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో క్యాసినో ఆడి రూ. కోటీ సంపాదించాలనుకుంటాడు. అయితే క్యాసినోలో ఉన్నదంతా పోగొట్టుకుంటాడు.
అదే సమయంలో గురుకి ఓ పెన్‌డ్రైవ్ దొరుకుతుంది. అందులో రూ. 1000 కోట్లకు సంబంధించిన రహస్యం ఉంటుంది. ఆ డబ్బుని దక్కించుకునేందుకు ప్లాన్ వేస్తాడు. అదేంటి? వైజాగ్‌లోని థియేటర్ యజమాని విన్సెంట్ (శివ్ పండిట్), డ్రగ్స్ మాఫియా డాన్ వీరయ్య రెడ్డి(సంపత్ రాజ్) కు రూ. 1000 కోట్లతో ఉన్న సంబంధం ఏంటి? దయా ఎవరు? వీరయ్య రెడ్డికి దయాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు రూ. 1000 కోట్లు ఎవరికి దక్కాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సినీ నేపథ్యం ఉన్న ఓ 28 ఏళ్ల కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడంటే.. అతని ఆలోచనల్లో కొత్తదనం ఉంటుందని, కథను చెప్పే విధానంలోనూ ఓ ప్రత్యేకత కనిపిస్తుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అందులోనూ విజయ్ తనయుడు సంజయ్ తొలి సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. అయితే ‘సిగ్మా’ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
ఒక కథలో కొత్త పాయింట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. కానీ బలమైన ఎమోషన్ ఉండాలి. కనీసం ప్రేక్షకుడిని తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూసేలా చేసే ట్విస్టులు, టర్న్‌లు ఉండాలి. కానీ ‘సిగ్మా’లో వీటిలో ఏ ఒక్క అంశం కూడా బలంగా కనిపించదు. కథ మొదలైనప్పటి నుంచి ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కాదు. కథ మాత్రమే కాదు దానికి ఇచ్చిన ట్రిట్మెంట్ కూడా పాతగానే ఉంది. ఇంటర్నెట్ యుగంలో హీరో ఓ లైబ్రరీ నడుపుకోవడం ఏంటి? సినిమా థియేటర్ అండర్‌గ్రౌండ్‌లో క్యాసినో ఆడించడం ఏంటి? ఓ యంగ్ డైరెక్టర్ రాసుకునే కథేనా ఇది? కథ పాతదైనా పర్లేదు కనీసం స్క్రీన్‌ప్లే అయినా కొత్తగా ఉండాలి కదా? అదీ లేదు.
ఇంటర్వెల్ వరకు కూడా కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కాక.. ‘ఇంతకీ అసలు గొడవేంటి?’ అనే సందేహం వెంటాడుతుంది. ఆ తర్వాత రూ.1000 కోట్ల చుట్టూ కథ తిరుగుతుంది. హీరో ఆ డబ్బుకు చేరువయ్యే ప్రయత్నం.. దారిలో ఎదురయ్యే అడ్డంకులు.. ఇవేవీ ఉత్కంఠను రేకెత్తించలేకపోయాయి. క్లైమాక్స్ సినిమా ప్రారంభం అయినా కాసేపటికే ఊహించొచ్చు.
ఎవరెలా చేశారంటే..
సందీప్ కిషన్ కొత్తగా చేసిందేమి లేదు. గత సినిమాల మాదిరే ఇందులోనూ సింపుల్‌గా యాక్ట్ చేశాడు. యాక్షన్ సీన్లు కొంతవరకు ప్రెష్‌గా అనిపిస్తాయి. ఫరియా అబ్దుల్లా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆమె ట్రాక్ కూడా బలవంతంగా అతికినట్లుగానే అనిపిస్తుంది. సంపత్ రాజ్ రెగ్యులర్ విలనిజమే పండించాడు. మిగతావారంతా తమ తమ పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా జెస్ట్ ఎకే. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల అతిగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Tags : 1