కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
Published on Sat, 10/17/2026 - 11:39
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా(75) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమిళనాడుకు చెందిన దేవా పూర్తి పేరు దేవనేశన్ చొక్కలింగం. 1950 నవంబర్ 20న జన్మించిన ఆయన.. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో సేవలందించారు. ప్రధానంగా తమిళ సినిమాలకు సంగీతం అందించిన ఆయన.. తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా పనిచేశారు.
‘అన్నామలై’తో మారిన కెరీర్!
తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన దేవాకు 1990వ దశకంలో మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘అన్నామలై’ సినిమా ఆయన కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రానికి అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ తెరపై కనిపించే సన్నివేశాలకు తన సంగీతంతో ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘బాషా’, ‘వీరా’, ‘ముత్తు’, ‘పడయప్పా’ వంటి చిత్రాలతో దేవా పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. కథానాయకుడి పాత్రకు తగ్గట్టుగా మాస్ బీట్స్ అందించడంలో ఆయన ప్రత్యేకత కనిపించేది. అదే సమయంలో ప్రేమకథలకు మధురమైన పాటలను కూడా అందించగలరని నిరూపించారు.
తెలుగులోనూ...
మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో వందలాది సినిమాలకు సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా తమిళ గానా సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయనది కీలక పాత్ర. తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా దేవ సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతం అందించిన తెలుగు చిత్రాల్లో ‘భలే పెళ్లాం’, ‘మాస్టర్’, ‘ఆటో డ్రైవర్’, ‘తొలిప్రేమ’, ‘గ్రీకు వీరుడు’, ‘లవ్స్టోరీ 1999’, ‘బాగున్నారా?’, ‘కలుసుకోవాలని’, ‘నాగ’, ‘నాయుడమ్మ’, ‘కారా మజాకా’ తదితర చిత్రాలు ఉన్నాయి.
(చదవండి: 400కు పైగా సినిమాలు.. ఎన్నో సూపర్హిట్ పాటలు.. దేవా సంగీత ప్రస్థానం)
దేవ కుటుంబం కూడా సంగీత రంగంతో అనుబంధం కలిగి ఉంది. ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా సైతం సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. దేవ సోదరులు సబేశ్–మురళి సంగీత దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది భాషల్లో వందలాది చిత్రాలకు సంగీతాన్ని అందించి, తనదైన శైలితో అభిమానులను సంపాదించుకున్న దేవ మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Tags : 1