కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి
Breaking News
తారాపథంలో కాసుల వేట
Published on Sun, 08/30/2026 - 05:23
సినిమా స్టార్స్‌కి ఆదాయం ఎలా వస్తుంది? అంటే వెంటనే రెమ్యూనరేషన్ ద్వారా అని ఠక్కున చెప్పేసే రోజులు కావివి. యాడ్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్... అంటూ వరుసపెట్టి లెక్కించే రోజులు. ‘ఇందుగల దందు లేదను సందేహంబు వలదు ఎందెందు చూసినా అందందే కలదు’ అన్నట్టుగా తారలకు ఆదాయ మార్గాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలోనైతే కాదేదీ కాసుల వేటకు అనర్హం అన్నట్టుగా అది తారా స్థాయికి చేరుకుంది.
వరుసగా ‘యాడ్’ చేసుకుంటూ...
ఒకప్పుడు హీరో, హీరోయిన్‌కి సినిమా ఒప్పందం కుదిరితే అందులోనే పారితోషికం ప్రధానంగా ఉండేది. ఏడాదికి కొన్ని సినిమాలు.. వాటి ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌ను మాత్రమే ప్రధాన ఆదాయంగా భావించేవారు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, దీపికా పదుకోన్ వంటి వారు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా సినిమాలు దాటి అడ్వర్టయిజ్‌మెంట్లలోకి తారలు రావడంతో సినిమాలకు ఆవల తారలకు ఆదాయం మొదలైంది. అక్కడ నుంచి ఒక్కొక్కటిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ పోయాయి.
ఈవెంట్... స్టార్ వెంటే...
‘‘ఐదేళ్ల పాటు ఒక సినిమాకు సైన్ చేయడం వల్ల అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈవెంట్లు నాకు బాగా ఉపయోగపడ్డాయి’’ అంటూ ఇటీవల ఒక టాలీవుడ్ నటి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే... ఇప్పుడు స్టార్స్ జీవితంలో ఈవెంట్స్ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ మోస్తరు స్థాయి కలిగిన నటి/నటుడికైనా సరే షోరూమ్స్ ఓపెనింగ్స్ అనేవి రూ.లక్షల్లో ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ వంటి వారైతే రూ .3 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారట.
స్టార్... అంబాసిడర్...
సాధారణ ప్రకటనలతో పాటు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు కూడా తారలకు పెద్ద ఆదాయ మార్గంగా మారాయి. దుస్తులు, నగలు, వాచీలు, కార్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్, ఫుడ్ బ్రాండ్లు.. ప్రతీ ఉత్పత్తీ స్టార్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని ఆరాటపడడం తారలకు పైసా వసూల్‌గా మారింది. కేవలం ప్రకటనలో నటించడం మాత్రమే కాదు. కంపెనీ కార్యక్రమానికి హాజరవడం, కొత్త షోరూమ్ ప్రారంభించడం, ఉత్పత్తిని సోషల్ మీడియాలో చూపించడం, బ్రాండ్ ఈవెంట్‌లో మాట్లాడటం... ఇలా ఒప్పందం ఆధారంగా అంబాసిడర్ సేవలకు తగ్గట్టుగా స్టార్స్‌కు పారితోషికం అందుతోంది. ఇది ఓ రకంగా ఏడాదికోసారి అందే జీతం లాంటిదని చెప్పోచ్చు. ఈ తరహా ఒప్పందాల కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్ల వరకూ వసూలు చేస్తారని సమాచారం.
హోస్ట్... ఆదాయానికి బెస్ట్...
సినిమా కాకుండా టెలివిజన్, ఓటీటీ కూడా తారలకు మరో ఆదాయ వేదికగా అమరిపోయింది. కౌన్ బనేగా కరోర్ పతి అంటూ అమితాబ్ అరంగేట్రం చేయించిన స్టార్ ఆధారిత గేమ్ షోలు ఇప్పుడు స్టార్స్‌ని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. టాక్ షోలు, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, వెబ్ సిరీస్‌లకు హోస్టింగ్ చేయడం... ఒక్కో కార్యక్రమానికి వేర్వేరుగా ప్రత్యేక పారితోషికం అందుతోంది. ప్రస్తుతం అన్ని భాషల్లో హల్ చల్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఈ తరహా స్టార్ ఆధారిత కార్యక్రమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. హిందీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఒక్క ఎపిసోడ్‌కే రూ. 10 నుంచి 15 కోట్ల వరకూ అందుకుంటున్నారని అంచనా.
స్టార్ కనిపిస్తే చాలు
సినిమా షూటింగ్‌లో కాకుండా ఒక వివాహ వేడుకలో, కార్పొరేట్ ఈవెంట్‌లో, షోరూమ్ ప్రారంభోత్సవంలో లేదా అవార్డు కార్యక్రమంలో కనిపించడం కూడా ఇప్పుడు స్టార్లకు పెద్ద ఆదాయమే. టాప్ బాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించడానికి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఆ స్టార్ ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి వచ్చే ప్రచారం, సోషల్ మీడియా రీచ్, ఫొటోలు, వీడియోలు, బ్రాండ్‌కు లభించే గుర్తింపు కూడా ΄్యాకేజీలో భాగమే. పలువురు సంపన్నుల వివాహ వేడుకల్లో కనిపించడానికి ఇంత, నర్తించడానికి ఇంత, గెస్ట్‌లతో పిచ్చాపాటీకి ఇంత... చొప్పున కూడా స్టార్స్ అందుకుంటున్నారు.
సోషల్ మీడియా... సెలబ్రిటీకి వేరయా...
అనేక మందిని సెలబ్రిటీలుగా మార్చిన ఘనత సోషల్ మీడియాదే అనడం నిస్సందేహం. అలాగే సెలబ్రిటీలను మరింత ధనవంతులుగా మారుస్తోన్న పుణ్యం కూడా దానిదే అని చెప్పాలి. తారలకు అందే ఆదాయ అవకాశాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అన్ని రకాల బం«ధనాల్ని తెంచేసింది డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియా విప్లవంతో స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ ఒక ఆస్తిగా మారింది. ఒక ప్రముఖ సెలబ్రిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్రాండ్‌ను ప్రస్తావిస్తే లక్షలాది మంది కళ్లముందు ఆ ఉత్పత్తి కనిపిస్తుంది. స్టార్‌కి ఉన్న ‘రీచ్’ను కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి.
కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం టాప్ సెలబ్రిటీల ఒక్కో స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటో, రీల్ లేదా బ్రాండ్ ప్రస్తావన చేయడం ద్వారా స్టార్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు. స్టాటిక్ పోస్టు, స్టోరీ, రీల్, బ్రాండ్‌తో కొలాబరేషన్... ఒక్కో ఫార్మాట్‌కి ఒక్కో రేటు ఉంటుంది.
పెద్ద ఫాలోయింగ్‌తో పాటు ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీకి మరింత విలువ ఉంటుంది. కేవలం ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారానే ప్రియాంక చో ప్రా రూ .3 నుంచి 4 కోట్ల వరకూ అందుకుంటుందని సమాచారం. ఒక స్టార్‌కి 5 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే, ఆ సంఖ్యను కంపెనీ తన ఉత్పత్తిని ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా డిజిటల్ రీచ్, ఎంగేజ్‌మెంట్, అభిమానుల ఆదరణ కూడా స్టార్ పారితోషికాన్ని నిర్ణయించే అంశాలుగా మారాయి.
ఎడ్వర్టయిజ్‌మెంట్ నుంచి ఎమోషన్ దాకా...
‘‘మీ అభిమాన హీరో/హీరోయిన్‌తో మీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకోవాలనుకుంటున్నారా?’’ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వ్యాపారంగా మారింది. ట్రూ ఫ్యాన్, సెలెవిష్, ఫ్యాన్ బజ్ వంటి ΄్లాట్‌ఫామ్‌ల ద్వారా సెలబ్రిటీల నుంచి వ్యక్తిగత వీడియో సందేశాలు, బర్త్‌డే విషెస్, యానివర్సరీ విషెస్, షౌట్‌ఔట్స్ వంటివి బుక్ చేసుకునే అవకాశం వచ్చేసింది. అంటే... కూర్చున్న చోట్నుంచి కదలకుండా స్టార్ అభిమానికి నేరుగా కనిపించడమే ఒక మోనిటైజేషన్ మోడల్‌గా మారింది. దీంతో ‘ఫ్యాన్ ఫాలోయింగ్’ అనే పదానికి కొత్త అర్థం వచ్చింది. ఒకప్పుడు అభిమానులు స్టార్ ఫొటోను కొనేవారు. ఇప్పుడు స్టార్ తమ పేరు చెప్పే వీడియోను కొనుగోలు చేస్తున్నారన్నమాట.
ఆట చూడడం కూడా ఆదాయమే...
తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి మద్దతుగా మ్యాచ్‌కి వెళ్లిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ... ఆమె సాధారణంగా కనిపించే దుస్తులతో ఉన్నప్పటికీ ఆమె వైరల్ అయింది. దానికి కారణం ఆమె చేతికి పెట్టుకున్న అంతర్జాతీయ బ్రాండ్ కార్టియర్ పాంథేర్ వాచ్. ఆమె పెట్టుకున్న వాచ్‌కి సోషల్ మీడియాలో, ఫ్యాషన్ మీడియాలో విపరీతమైన ఆసక్తి వచ్చింది. ఆ వాచ్ విలువను కొన్ని నివేదికలు సుమారు రూ. 28 లక్షలుగా పేర్కొన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అనుష్క ఈ వాచీ గురించి ఏ ప్రకటన కూడా చేయలేదు. కానీ ఆమె ధరించిన వస్తువు వార్తగా మారింది. ఇదే స్టార్ పవర్. ఒక సెలబ్రిటీ ఏం ధరిస్తే అది ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారుతుంది. అందుకే బ్రాండ్లు సెలబ్రిటీల ‘ఆర్గానిక్ విజిబిలిటీ’ కోసం కూడా పోటీ పడుతున్నాయి.
పెళ్లి వీడియోలకూ ‘రేట్’ ఉంది...
సెలబ్రిటీల పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, హనీమూన్లు, కుటుంబ వేడుకలు ఇప్పుడు కేవలం వ్యక్తిగత వ్యవహారాలు మాత్రమే కావు. వాటికి భారీ ప్రేక్షక విలువ ఏర్పడింది. నయనతార–విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ హక్కులను ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ మొత్తం సుమారు రూ. 25 కోట్లుగా ఉండొచ్చట. అదే క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు తమ వివాహ వేడుకల ప్రసార హక్కుల్ని విక్రయిస్తున్నారు. అంటే ఒకప్పుడు ‘ఇది మా వ్యక్తిగత జీవితం’ అంటూ మీడియాకు దూరంగా ఉంచే విషయాలు కూడా ఇప్పుడు డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ లేదా ప్రత్యేక కంటెంట్‌గా మారి కోట్ల రూపాయల విలువను సంతరించుకుంటున్నాయి.
స్టార్ అంటే... ఒక బ్రాండ్
ఇప్పటి స్టార్ కేవలం నటుడు కాదు. యాక్టర్ + ఇన్‌ఫ్లుయెన్సర్ + బ్రాండ్ అంబాసిడర్ + ఈవెంట్ గెస్ట్ + కంటెంట్ క్రియేటర్ + బిజినెస్ బ్రాండ్. సినిమా నుంచి వచ్చే పారితోషికం ఇప్పటికీ ప్రధాన ఆదాయమే. కానీ దాని చుట్టూ ఏర్పడిన ఈ కొత్త ఆదాయ మార్గాలు స్టార్ సంపాదనను మరింత విస్తరించాయి. అందుకే నేటి సినిమా మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మారిపోయింది. ‘ఈ స్టార్ ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు?’ అనేది మాత్రమే కాదు... ‘ఈ స్టార్ పేరు, ఇమేజ్, ఫాలోయింగ్, వ్యక్తిగత జీవితానికి మార్కెట్‌లో ఎంత విలువ ఉంది?’ అనేదే అసలు ప్రశ్న. నిన్నటి వరకు స్టార్ తెరపై కనిపిస్తే నిర్మాత డబ్బు చెల్లించేవాడు. నేడు స్టార్ ఎక్కడ కనిపించినా.. ఆ కనిపించడానికే ఒక ధర చెల్లించడానికి నిర్మాతల్ని మించి ఎందరో ఉన్నారు..
స్టార్... స్టార్టప్స్...
సినిమా తారలు కేవలం నటులుగా కాకుండా తెలివైన పెట్టుబడిదారులుగా కూడా కనిపించాలని కోరుకుంటున్నారని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదగడంతో బాలీవుడ్ తారలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ధోరణి మరింత ఊపందుకుంది. ఈ ట్రెండ్ కొత్తది కాదు. 2010ల ప్రారంభంలోనే ఇది మొదలైంది. అప్పట్లో భారత స్టార్టప్ రంగం వేగంగా ఎదగడం ప్రారంభించింది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలి తరం సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరు. 2012లో ఆయన ట్రావెల్ పోర్టల్ యాత్రాలో మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత పలువురు తారలు ఈ మార్గాన్ని అనుసరించారు. 2022లో ఒక్క ఏడాదిలోనే 14 మంది భారతీయ నటులు 18 స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిలో ఎక్కువ భాగం డైరెక్ట్–టు–కన్సూ్యమర్ (డి2సి) బ్రాండ్లే. మిగిలిన పెట్టుబడులు ఎడ్‌టెక్, ఈ–కామర్స్, ఫుడ్‌టెక్ వంటి రంగాల్లోకి వెళ్లాయి.
సినిమాల్లో పెట్టుబడుల కన్నా...
గతంలో చాలామంది నటులు తమ సంపాదనను ప్రధానంగా సినిమాలు, సినిమా నిర్మాణం వంటి రంగాల్లోనే పెట్టేవారు. అయితే సినిమా నిర్మాణం అధిక రిస్క్‌తో కూడిన వ్యాపారం కావడంతో కొందరు తారలు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటున్న ఇప్పటి తరం సెలబ్రిటీలు మాత్రం తమ సంపదను ఒకే రంగంలో పెట్టకుండా విభజిస్తున్నారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు స్టార్టప్‌ల్లోనూ డబ్బు పెడుతున్నారు. పెట్టుబడి నిపుణుల అభి ప్రాయం ప్రకారం, స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టడం అనేది సెలబ్రిటీలకు తమ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా ఉంచుకునే ఒక మార్గంగా మారింది.
ఇందులో రెండు వైపులా ప్రయోజనం ఉంది..
స్టార్‌కు: కొత్త వ్యాపారాల్లో వాటా లభిస్తుంది. కంపెనీ విజయవంతమైతే పెట్టుబడి విలువ పెరుగుతుంది. తన సినిమాలపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
స్టార్టప్‌కు: డబ్బుతో పాటు సెలబ్రిటీ పేరు, సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రచారం, బ్రాండ్ గుర్తింపు లభిస్తాయి. అందుకే నేటి సెలబ్రిటీ ఎకానమీలో ‘స్టార్ పెట్టుబడి పెట్టాడు’ అనేది కేవలం పెట్టుబడి వార్త కాదు.. ఆ స్టార్టప్‌కు మార్కెటింగ్ వ్యూహం కూడా
ఉపసంహారం...
రాస్తే ఆకాశమంత కొలిస్తే కొండంత అన్నట్టుగా ప్రస్తుతం స్టార్స్‌కి ఉన్న ఆదాయావకాశాల జాబితా సాగిపోతూనే ఉంటుంది. రోజుకొకటిగా పుట్టుకొస్తున్న డిజిటల్ వ్యూహాలు తారలకు కాసుల పంట పండిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పుకాదనడం ఎంత నిజమో... అలాగే ఆ ఇంటికి పునాది లాంటి సమాజాన్ని చక్కదిద్దడంలోనూ తమ వంతు పాత్ర పోషించాలి అన్నదీ అంతే నిజం.
సొంత బ్రాండ్... సొంత వ్యాపారం
ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ సొంత బ్రాండ్లను కూడా సెలబ్రిటీలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ తార ఆలియా భట్ పర్యావరణహిత, స్వదేశీ బ్రాండ్‌ను విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దిన వైనం దీనికో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక దీపికా పదుకోన్ స్వయంగా 82నిఇ పేరుతో స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ బ్యూటీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్‌లో వాటా కొనుగోలు చేశారు. నటి అనుష్కా శర్మ తన భర్త టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ప్లాంట్–బేస్డ్ మీట్ కంపెనీ బ్లూ ట్రైబ్ ఫుడ్జ్‌లో పెట్టుబడి పెట్టారు.
ఈ పెట్టుబడి ద్వారా ఆ కంపెనీకి కేవలం ఆర్థిక మద్దతే కాకుండా భారీ స్థాయిలో ప్రచారం కూడా లభించింది. కంపెనీ వర్గాల ప్రకారం, వారి మద్దతుతో ప్లాంట్–బేస్డ్ మీట్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అవగాహన ఏర్పడింది.
ఈ వైవిధ్యం సెలబ్రిటీల సంపాదన, పెట్టుబడి వ్యూహాల్లో వచ్చిన గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటి తారలు తమ స్టార్‌డమ్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కేవలం సినిమా ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం లేదు. స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టడంతో పాటు తమకున్న భారీ మీడియా ప్రెజెన్స్‌ను ఆ బ్రాండ్ల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. ఒక సెలబ్రిటీకి ఉన్న ప్రజాదరణ కొత్త బ్రాండ్‌కు తక్షణ గుర్తింపును తీసుకురావడమే కాకుండా, వినియోగదారుల్లో ఆ బ్రాండ్‌పై నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్టార్టప్‌లకు సెలబ్రిటీ పెట్టుబడులు కేవలం డబ్బు సమకూర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడవు. ఆ స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా రీచ్, అభిమానుల నమ్మకం కూడా కంపెనీకి అదనపు ఆస్తులుగా మారతాయి. – సత్యబాబు
Tags : 1