జగమెరుగని జగ్గయ్య బహుముఖ ప్రతిభ

Published on Sat, 04/18/2026 - 00:11

అది 1975 సంవత్సరం... కర్నూల్‌ మెడికల్‌ కాలే జీలో ఫైనల్‌ ఇయర్‌ ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు కాలేజీ వార్షికోత్సవానికి నేను మద్రాసు వెళ్లి జగ్గయ్యగారిని ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. అదే ఆయనతో నా మొదటి పరిచయం. ఆయనంటే నాకు వల్లమాలిన అభిమానం. నేను 1983లో విజయవాడలో సైకియాట్రిస్టుగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తరువాత జగ్గయ్యగారు బెజవాడ వచ్చినప్పుడల్లా కలిసేవాడిని.

నేను రచించిన ‘మనో దర్పణం’ మనోవైజ్ఞానిక గ్రంథాన్ని 1996లో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌లో ఆవిష్కరించేందుకు నా కోరిక మేరకు ఆయన మద్రాసు నుండి రావడం నా పైన, సాహిత్యం పైన ఆయనకున్న అభిమానానికి తార్కాణం. ఆయన చివరి వరకు చెన్నై వెళ్లినప్పుడల్లా మేం కలిసి పలు విషయాలు ముచ్చటించుకునేవాళ్లం. ఒక డాక్టర్‌గానే కాకుండా రచయితగా సాహిత్యం పైన మక్కువ ఉన్న వ్యక్తిగా నన్ను ఆయన ఇష్టపడేవారు. అదే నాకు, జగ్గయ్యగారికి ఉన్న సాహితీ బంధం.

ఇది జగ్గయ్య శతజయంతి సంవత్సరం
1926 డిసెంబర్‌ 31న జన్మించిన జగ్గయ్య 2004 మార్చి 4న మరణించారు. జగ్గయ్య చలనచిత్ర నటుడిగానే అందరికీ తెలుసు కానీ, మిగతా ఏ నటులకు లేనన్ని బహుముఖ ప్రతిభలు ఆయనకే సొంతం. త్రిపురనేని గోపీచంద్‌ దర్శకత్వంలో ‘ప్రియురాలు’ (1952) సినిమాతో ప్రారంభమైన ఆయన దాదాపు 500 సినిమాల్లో నటించారు. ‘కుంతీపుత్రుడు’ (1993) ఆయన చివరి చిత్రం. జగ్గయ్య నిర్మించి, నటించిన ‘పదండి ముందుకు, కీలు బొమ్మలు’ చిత్రాలు అటు మాస్కో, కార్క్‌ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ప్రశంసలు అందుకు న్నాయి. జగ్గయ్య క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, సాఫ్ట్‌ విలన్‌ రోల్స్‌ వేస్తే అసలు హీరో కనబడకుండా పోయేవాడని ఆ కాలంలో ప్రతీతి. 

పాలిష్డ్‌ విలన్‌ రూపకర్త
తెలుగు సినిమాల్లో ‘పాలిష్డ్‌ విలన్‌’ పాత్రలకు మొదట రూపకల్పన చేసింది జగ్గయ్యే! అసాధారణ సాత్విక భావ ప్రకటన, ఉచ్చారణ వైవిధ్యం ఆయన్ను తెలుగు సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని నటుడిగా నిలబెట్టాయి. హీరో అంటే స్టెప్పులు, డాన్స్, స్టంట్స్‌ కాకుండా నిజజీవితంలో ఒక హీరో ఎలా ఉండాలో అలాగే సినిమాల్లో కూడా హీరో పాత్ర సహజంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం.

సావిత్రి, జమున సినిమాల్లోకి రాకముందు నాటక రంగానికి వారిని పరిచయం చేసింది జగ్గయ్యే! అలాగే ప్రముఖ హీరో కృష్ణను ‘తేనె మనసులు’ చిత్రానికి ముందే జగ్గయ్య తాను 1962లో నిర్మించిన ‘పదండి ముందుకు’ ద్వారా పరిచయం చేసినది బహుశా చాలామందికి తెలియని విషయం. ఇక కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని రూథర్‌ ఫోర్డ్‌ పాత్రలో జగ్గయ్య నటన అమితంగా ఆకట్టుకుంది. ఇంకా జగ్గయ్య తెలుగుకి పరిచయం చేసినవారిలో కన్నడ నటి భారతి, నటుడు శ్రీధర్‌ ఉన్నారు. సంగీత దర్శకుడు కోదండపాణిని ‘పదండి ముందుకు, కన్న కొడుకు’ చిత్రాల ద్వారా పరిచయం చేసింది, ఇంకా పలువురు రచయితలను పరిచయం చేసిన ఘనత జగ్గయ్యదే.

టీచర్‌ నుంచి న్యూస్‌ రీడర్‌గా...
దుగ్గిరాల స్కూల్లో టీచర్‌గా ప్రారంభమైన జగ్గయ్య కెరీర్‌ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్‌ రీడర్‌గా వెళ్లడంతో జర్నలిస్ట్‌గా మలుపు తిరిగింది. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అనగానే ఆయన కంచు కంఠానికి అందరూ చెవులప్పగించేవారు. శివాజీ గణేశన్‌ నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో జగ్గయ్యే డబ్బింగ్‌ చెప్పారు. ఇక నాటక రంగానికి వస్తే చిన్న వయస్సు నుండే రంగస్థలం మీద నటుడిగా– దర్శకుడిగా రాణించారు. షేక్స్‌పియర్‌ ఇంగ్లిష్‌ నాటకాలను అనువదించి, ప్రదర్శించేవారు కూడా. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏలో సహవిద్యార్థి అయిన ఎన్టీఆర్, ముక్కామల, శివరావులతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించారు.

చిన్న వయసులోనే రచయితగా...
జగ్గయ్య తన 14వ ఏట నుండి కవితలు, నాటికలు రాయటం మొదలుపెట్టారు. ఆ చిన్న వయసులోనే హంపి వెళ్లి అక్కడి శిధిలావస్థను చూసి, చలించి తన స్వదస్తూరితో రాసుకున్న పద్యాలలో మచ్చుకు ఒకటి. విశ్వకవి రవీంద్రుడి ‘గీతాంజలి’ని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించి అందరి ప్రశంసలు అందుకున్నారు జగ్గయ్య. రాజకీయాలపై ఉన్న మక్కువతో ‘రాజకీయ విజ్ఞాన కోశం’గ్రంథాన్ని రాశారు. ‘దేశాభిమాని’ పత్రికకు 1944లో సబ్‌ ఎడిటర్‌గాను, ‘ఆంధ్రా రిపబ్లిక్‌’ అనే ఆంగ్ల పత్రికకు ఎడిటర్‌గాను బాధ్యతలు నిర్వహించారు.  

లోక్‌సభకు ఎన్నికైన తొలి నటుడు
మొదటి నుండి జగ్గయ్యకు రాజకీయాలంటే మక్కువ. ఆచార్య నరేందర్‌ దేవ్‌ కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీలో ఉంటూ తదుపరి 1958లో కాంగ్రెస్‌ పార్టీలో పని చేశారు. 1962 జనరల్‌ ఎలక్షన్స్ లో తెనాలి లోక్‌సభ నుండి ఆచార్య ఎన్‌జీ రంగా మీద పోటీకి కాంగ్రెస్‌ పార్టీ జగ్గయ్యను నిర్ణయించగా, ఆయన్ను నాటి ప్రధాని నెహ్రూ ఢిల్లీకి రప్పించి, రంగా మీద పోటీ వద్దని వారించారు.

కమ్యూనిస్టుల చేతిలో రంగా ఎలాగైనా ఓడిపోతారని జగ్గయ్య చెప్పినా, రంగా ఓటమికి కాంగ్రెస్‌ పార్టీ కారణం కాకూడదు, రంగా లాంటివారు పార్లమెంటుకు రావడం అవసరం అని జగ్గయ్యను పోటీ నుంచి విరమింపజేశారు నెహ్రూ. తదుపరి 1967 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుండి జగ్గయ్య కమ్యూనిస్టు అభ్యర్థిపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి భారత దేశంలోనే సినీ రంగం నుండి లోక్‌సభకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్‌కి ఎక్కారు.

చిత్రకారుడుగానూ...
జగ్గయ్య మంచి చిత్రకారుడు కూడా. అడవి బాపిరాజు దగ్గర శిక్షణ పొంది పలు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు. ఇన్ని రంగాల్లో ఉంటూ కూడా సినీ కార్మికుల సంక్షేమం కోసం దక్షిణ భారత సినీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయనకు వాస్తు శాస్త్రంపై మక్కువ ఎక్కువ. అయితే మూఢనమ్మకాలతో ఇల్లు గుల్ల చేసుకోకుండా వాస్తును శాస్త్రీయ కోణంలో మాత్రమే చూసి ఆచరించాలనేవారు.

ఆత్రేయతో అనుబంధం
ఆచార్య ఆత్రేయ అంటే జగ్గయ్యకు వల్ల మాలిన అభిమానం. ఆత్రేయ గురించి ‘మాది మనసులు కలిసిన అనుబంధం’ అనేవారు. ఆత్రేయ కడపటి కోర్కెను తీర్చడం కోసం ‘మన స్విని ట్రస్టు’ తరపున జగ్గయ్య సంపాదకత్వం వహించి, ప్రచురించిన ‘ఆత్రేయ సాహితి’ ఏడు సంపుటాల సెట్‌ జగ్గయ్యకు ఆత్రేయతో ఉన్న అనుబంధానికి ఒక నిదర్శనం. ‘మనస్విని’ సంస్థ ఎంపిక చేసిన పాటలకే పలుమార్లు ప్రభుత్వ నంది అవార్డులు కూడా రావటం ఆయన ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా జరిగే ఎంపికే అన్నది పరిశీలకుల అభిప్రాయం. అభిమాన సంఘాలకు, ప్రచారాలకు, ఆర్భాటాలకు ఆమడ దూరం ఉండేవారు. 

1992లో పద్మ భూషణ్‌ 
తెనాలి ఆర్ట్స్‌ కాలేజీకి, వరంగల్‌ మెడికల్‌ కాలేజీకి, మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు ఉదారంగా విరాళమిచ్చారు. పురస్కారాల విష యానికొస్తే.. 1967లో అంతర్జాతీయ సంçస్కృత విశ్వవిద్యాలయం నుండి ‘కళావాచస్పతి’ పురస్కారం, 1991లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1992లో తెలుగు చిత్రసీమలో నేరుగా పద్మభూషణ్‌ గౌరవాన్ని రాష్ట్రపతి నుండి పొందిన ఘనత జగ్గయ్యదే.

ప్రతిభలు అనేకం
జనానికి తెలియని జగ్గయ్య బహుముఖ ప్రతిభలు అనేకం. ఆయన కేవలం నటుడే కాదు గొప్ప సాహితీవేత్త, మంచి ఉపన్యాసకుడు, అధ్యాపకుడు, రాజకీయ నాయకుడు, ట్రేడ్‌ యూనియనిస్ట్, చిత్రకారుడు, రేడియో ప్రవక్త, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే జగ్గయ్య ఇన్ని కళల్లో ఆరితేరినా ఆయన ప్రేమించినది సాహిత్యాన్ని, పెళ్ళాడింది నటనను. ఒక సందర్భంలో మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఇచ్చే సందేశం అని అడగ్గా ‘బ్రతుకు మనకీయబడిన వరమ్ము... తిరిగి పరులకిచ్చిననే దాని ఫలము దక్కు’ అని రవీంద్రుని సూక్తి రూపంలో చెప్పారు. ఇలాంటి బహుముఖ ప్రతిభగల మహోన్నత వ్యక్తి కొంగర జగ్గయ్యకి ఆయన శతజయంతి సందర్భంగా నా దివ్యాంజలి!

– డాక్టర్‌ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, విజయవాడ ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత
indlas2@gmail.com

Videos

ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్

మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR

అంబటి రాంబాబు నిరాహార దీక్ష

ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్

దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్

మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..

జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!

కూకట్ పల్లిలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?

Photos

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)