ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
ఘాటి.. అక్కడికి క్యూ కడుతున్న పర్యాటకులు
Published on Fri, 09/19/2025 - 08:43
ఇటీవల విడుదలైన ‘ఘాటి’ సినిమా కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు ఒక దృశ్య వేదికగా మారింది. ఈ నెల 5న విడుదలైన ఘాటి చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించింది. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, జిషు సేన్ గుప్త వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రత్యేక ఆకర్షణగా సహజసిద్ధ అందాలు
సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన డుడుమ జలాశయం, డుడుమ జలపాతం, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, వించ్ హౌస్, వ్యూపాయింట్, బలడ కేవ్స్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు వెండితెరపై ఈ ప్రాంత సహజసిద్ధ అందాలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఉద్యోగులు విధులకు వెళ్లే వించ్ హౌస్‌లో అనుష్క శెట్టి పది నిమిషాల యాక్షన్ ఫైటింగ్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సన్నివేశానికి థియేటర్లో చప్పట్లు మారుమోగాయి. అయితే, ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఘాటీ సినిమాతో తెరపైకి వచ్చిన ఈ ప్రదేశాలను చూసిన వారు చాలా బాగున్నాయంటూ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు.
డ్రోన్ విజివల్స్ హైలైట్
పోలీసు అధికారుల పాత్రలో నటించిన జగపతిబాబు, జాన్ విజయ్ డుడుమ జలాశయం డ్యామ్‌పై వాహనాలను తనిఖీ చేసి, లిక్విడ్ గంజాయిని పట్టుకున్న సన్నివేశం చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. డుడుమ జలపాతం , మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించిన అద్భుతమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా కెమెరామెన్ మనోజ్ సరిహద్దు ప్రాంతాల అందాలను చాలా చక్కగా ఒడిసిపట్టి తెరపై చూపించగలిగారు.

స్థానికుల ఆనందం
ఈ ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, అటవీ మార్గాలు, స్థానిక ప్రదేశాలను వెండితెరపై చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం తమకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతాల అందాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం కావడం వారికి గర్వకారణంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఘాటి’ సినిమా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు మరింత దోహదపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags : 1