చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!

Published on Wed, 07/01/2026 - 13:51

ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..

ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.

ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్‌.  ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ Steven Spielberg  తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.

2001 జూన్‌ 29న A.I. Artificial Intelligence రిలీజ్‌అయ్యింది. జులై మొదటి వారంలో భారత్‌లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్‌ మేధస్సు, స్పీల్‌బర్గ్‌ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. 

ఈ కథలో డేవిడ్‌ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.

ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్‌లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్‌ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?

చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)