Breaking News

నిక్షేపంగా న్యూక్లియర్‌ సైట్లు

Published on Thu, 06/26/2025 - 05:17

వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్‌ అధినేతలు శెభాష్‌ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్‌కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌ గైడెడ్‌ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. 

అమెరికా రక్షణశాఖ(పెంటగాన్‌)లోని నిఘా విభాగమైన డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(డీఐఏ) టాప్‌ సీక్రెట్‌ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్‌ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్‌ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్‌ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్‌ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్‌లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. 

నివేదికలో ఏముంది? 
ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్‌ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్‌ మళ్లీ న్యూక్లియర్‌ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ సెంటర్‌ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్‌ క్రూజ్‌ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్‌ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్‌ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

 భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్‌ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్‌లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్‌ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్‌నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. 

అదంతా అబద్ధం: ట్రంప్‌ 
అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్‌ సోషల్‌’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘అణురియాక్టర్‌లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్‌లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్‌ టైమ్స్, సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. 

బంకర్‌ బస్టర్‌ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్‌ఎన్‌పై ట్రంప్‌ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్‌ఎన్‌ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్‌ఎన్‌ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. 

స్పందించిన శ్వేతసౌధం 
నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్‌హౌస్‌.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్‌ సర్కార్‌ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్‌ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్‌ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్‌ చేశారు. 

ఇరాన్‌ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్‌వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్‌ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్‌ చెప్పారు. లీక్‌కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్‌బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. లీక్‌ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. 

నిజం దాస్తున్న ఇరాన్‌! 
శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ భఘైల్‌ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్‌నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్‌ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)