24 గంటలూ కరెంట్‌.. ఇంధనం మాత్రం జీరో!

Published on Thu, 07/09/2026 - 13:58

విద్యుత్‌ అంటే బొగ్గు, గ్యాస్‌, అణుశక్తి, జలవిద్యుత్‌, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్‌ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్‌ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.

జపాన్‌లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్‌ పవర్‌ ప్లాంట్‌’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్‌ ప్రపంచానికి చూపిస్తోంది.

అలా ఎలా?
ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్‌ మెంబ్రేన్‌ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్‌ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్‌లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది..  అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్‌కు మూలం అవుతుంది.

వాతావరణంతో సంబంధం లేదు
సౌర విద్యుత్‌కు ఎండ అవసరం. పవన విద్యుత్‌కు గాలి అవసరం. జలవిద్యుత్‌కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్‌లోడ్‌ పవర్‌ (నిరంతర విద్యుత్‌ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రయోజనాలే ప్రయోజనాలు
ఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్‌, డీజిల్‌ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్‌ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

సవాళ్లు కూడా..
అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్‌ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్‌. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్‌లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రపంచానికి కొత్త దారి..
సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్‌ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్‌లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్‌ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకో విశేషం.. 
2025 ఆగస్టులో జపాన్‌లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్‌ రిటార్డెడ్‌ ఆస్మోసిస్‌ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్‌లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్‌ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

:::వెబ్‌ స్పెషల్‌

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)