Breaking News

అమెరికాకు భారీ షాక్.. ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ!

Published on Sun, 06/21/2026 - 12:26

యుద్ధాలు కేవలం యుద్ధభూములకే పరిమితం కావు. అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన ప్రమాణాలను, అంతర్జాతీయ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి తాజా ఉదాహరణ అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్‌ అనలిస్టిక్స్‌ ‘Moody’s Analytics’ అంచనా వేసింది. అయితే ఇది కేవలం అమెరికా నష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు, ప్రాంతీయ సైనిక చర్యలతో స్పందించింది. యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను వణికించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ..
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్‌ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరుకునే పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరగడమే కాదు. విమాన ప్రయాణాలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఖర్చులు, ఆహార ధరలు ఇలా ప్రతి రంగంపైనా ప్రభావం పడింది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది.

అమెరికాపై ఎఫెక్ట్‌ ఎలా?
Moody’s Analytics లెక్కల ప్రకారం యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ట్రక్కింగ్, విమానయాన, తయారీ రంగాలపై అదనపు భారం పడింది. ఫలితంగా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఇలా ప్రతి అమెరికా కుటుంబం సగటున వందల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి వచ్చినట్లు అంచనా. మరోవైపు ప్రభుత్వం సైనిక చర్యలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ మోహరింపు, మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాల నిర్వహణ కోసం భారీ మొత్తాలను ఖర్చు చేసింది. మరోవైపు.. అమెరికా ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న జాతీయ రుణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో భారీ సైనిక ఘర్షణ ఫెడరల్ బడ్జెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం రాజకీయంగా కూడా పెద్ద అంశం. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగితే అధికార ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే యుద్ధం ప్రభావం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యుద్ధభూమిలోనే కాదు.. మార్కెట్లలో కూడా నష్టం
ఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. బంగారం, డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. యూరప్‌లో ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇంధన ఖర్చుల పెరుగుదల మరింత దెబ్బతీసింది. ఆసియా దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరిగింది.

భారత్‌పై ప్రభావం?
భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి భారత్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల పరిస్థితులు కొంత సద్దుమణగడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం భారత్‌పైనా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.

యుద్ధం ముగిసినా..
ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్థిక ప్రభావం మాత్రం వెంటనే తగ్గే పరిస్థితి లేదు. చమురు సరఫరా గొలుసులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉండేదని అంచనా.

కాగా, యుద్ధాలు గెలుపు-ఓటముల గురించి మాత్రమే కావు. వాటి అసలు ఖరీదు ఆర్థిక వ్యవస్థలు, సాధారణ ప్రజలు, ప్రపంచ మార్కెట్లు చెల్లిస్తాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం కొన్ని వారాల్లో ముగిసినా, దాని ఆర్థిక ప్రతిధ్వనులు మాత్రం నెలలు, సంవత్సరాల పాటు వినిపించే అవకాశముంది. మిసైళ్లు కొన్ని నిమిషాల్లో పేలిపోతాయి... కానీ వాటి ఆర్థిక ప్రభావం మాత్రం ఏళ్ల తరబడి దేశాలను వెంటాడుతుంది. అమెరికాకు 132 డాలర్ల బిలియన్ల బిల్లు, ప్రపంచానికి ట్రిలియన్ల డాలర్ల భయం మిగిల్చిన ఘర్షణగా ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోనుంది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)