Breaking News

సూపర్ పవర్ ఇరాన్ డార్క్‌ సీక్రెట్‌.. ఇలాంటి పరిస్థితి ఎందుకు?

Published on Thu, 07/23/2026 - 12:10

ఇటీవలి కాలంలో ఇరాన్ అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది.. వీధుల్లో నిరసనలు, మహిళల హిజాబ్ ఆందోళనలు, ఇజ్రాయెల్-అమెరికా దేశాలతో యుద్ధాలు, ఆంక్షలు.. మతచాందసవాద ప్రభుత్వం..! కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు ఇరాన్ అంటే ఇదంతా కాదు..! ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్లలో ఇరాన్ ఒకటి. 2,000 ఏళ్ల చరిత్ర ఉన్న 'పర్షియన్ సామ్రాజ్యం' పశ్చిమాసియాతోపాటు.. మధ్య ఆసియాను ఏలింది..! మరి అలాంటి గొప్ప నాగరికత ఉన్న దేశం.. ఈ రోజు ఒక క్రూరమైన, మతచాందసవాద రెజీమ్‌గా ఎలా మారింది..? అమెరికా, బ్రిటన్ వేసిన ఎత్తుగడలు ఇరాన్‌ను ఎలా మార్చేశాయి.. ఇరాన్ అసలు రక్తచరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అసలు కథ తెలుస్తుంది..

చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకం 1800 ప్రాంతంలో ఇరాన్‌ను 'కజార్' రాజవంశం పాలిస్తోంది. బయటి ప్రపంచం దీన్ని 'పర్షియా' అని పిలిచేది. ఆ సమయంలో రెండు పెద్ద సామ్రాజ్యాలు ఇరాన్‌పై కన్నేశాయి. వాటిల్లో ఒకటి రష్యన్ ఎంపైర్, రెండోది బ్రిటిష్ ఎంపైర్. రష్యాకు చలికాలంలో గడ్డకట్టని సముద్ర మార్గాలు కావాలి. అందుకే రష్యా ఇరాన్‌పై దాడి చేసి.. కొన్ని యుద్ధాల్లో ఓడించి, ఇరాన్ సముద్ర మార్గాలపై పూర్తి హక్కులు సాధించింది. ఇది చూసి బ్రిటన్ వణికిపోయింది..!

రష్యా గనక ఇరాన్‌ను దాటుకుని ముందుకు వస్తే.. తమ అత్యంత విలువైన కాలనీ అయిన 'ఇండియా' రష్యా చేతికి చిక్కుతుందని భయపడింది. దాంతో బ్రిటన్, రష్యా మధ్య ఇరాన్‌ను ఎవరు కంట్రోల్ చేయాలనే ఒక పెద్ద పోటీ మొదలైంది. దాన్నే చరిత్రలో 'ది గ్రేట్ గేమ్' అంటారు. బ్రిటన్ ఓపెన్‌గానే చెప్పింది.. ‘మాకు ఇరాన్‌ను ఆక్రమించడం ఇష్టం లేదు. కానీ రష్యా ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోలేం..’ అని..! దాంతో ఇరాన్ రాజు షహా డబ్బుల కోసం తన దేశంలోని ఆస్తులను, రైల్వేలను, పరిశ్రమలను వ్యాపార హక్కులుగా రష్యా, బ్రిటన్‌లకు అమ్మేయడం మొదలుపెట్టాడు.

1908లో ఇరాన్‌లో ఒక పెద్ద నిధి దొరికింది.. అదే చమురు..! బ్రిటిష్ నావికాదళం తమ నౌకలను బొగ్గు నుంచి చమురుకు మార్చే సమయానికి ఇరాన్‌లో క్రూడాయిల్ దొరకడం ఒక వరంగా మారింది. దీంతో.. బ్రిటన్ 'ఆంగ్లో-ఇరానియన్ ఆయిల్ కంపెనీ'ని స్థాపించింది. ఇప్పటికీ కొనసాగుతున్న British Petroleum కంపెనీయే అది..! ఇరాన్ చమురును తోడేస్తూ బ్రిటన్ ధనికదేశమైంది. కానీ ఇరాన్‌కు ఇచ్చిన వాటా కేవలం 16 శాతం మాత్రమే..! దీన్ని నిరసిస్తూ.. 1951లో ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసద్దెగ్ (Mohammad Mosaddegh) అనే ప్రజాస్వామ్య నాయకుడిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. మొసద్దెగ్ వచ్చీ రాగానే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు.

‘‘ఇరాన్ చమురు ఇరాన్ ప్రజలదే..! విదేశీయులు నడిపే ఆయిల్ కంపెనీని జాతీయకరణ (Nationalize) చేస్తున్నాం’’ అని ప్రకటించాడు..! ఈ నిర్ణయాన్ని బ్రిటన్, అమెరికా తట్టుకోలేకపోయాయి. 1953లో అమెరికా CIA, బ్రిటన్ MI6 కలిసి ఇరాన్‌లో రహస్యంగా ఒక కుట్ర పన్నాయి. ఫలితంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రధాని మొసద్దెగ్‌ గద్దెదిగడమే కాకుండా.. జైలుపాలవ్వాల్సి వచ్చింది. బ్రిటన్, అమెరికాకు పెంపుడు కుక్కలా పనిచేసే 'మొహమ్మద్ రేజా షహా' (Mohammad Reza Shah) అనే రాజును సింహాసనంపై కూర్చోబెట్టారు..!

ఖమేనీ ఎంట్రీ.. 
అమెరికా రక్షణతో అధికారంలోకి వచ్చిన షహా.. ఇరాన్‌లో వేగంగా పాశ్చాత్యీకరణ చేయడం మొదలుపెట్టాడు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చాడు, పాఠశాలలు కట్టించాడు. సాంప్రదాయ ఇస్లామిక్ పద్ధతులను రద్దు చేశాడు. హిజాబ్‌ను నిషేధించాడు. తనను ఎదిరించిన వారిని సీఐఏ సాయంతో ఏర్పడిన 'సవాక్' అనే క్రూరమైన సీక్రెట్ పోలీసులతో హింసించి చంపేశాడు. ప్రజల్లో కోపం నరనరానా పాకింది..! ‘‘మన రాజు అమెరికా చేతిలో కీలు బొమ్మ.. మన సంస్కృతిని, చమురును విదేశీయులు దోచుకుంటున్నారు’’ అని ప్రజలు రగిలిపోయారు. ఆ సమయంలో వచ్చాడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ..!

ఆయన ఒక మత గురువు. ఆయన దేశం వెలుపల ఉంటూ క్యాసెట్ టేపుల ద్వారా ఇరాన్ ప్రజలకు సందేశాలు పంపేవాడు. ‘‘బ్రిటన్, అమెరికాలు మనల్ని బానిసలుగా చేశాయి. ఈ షహాను తరిమికొట్టండి..!’’ అని పిలుపునిచ్చాడు. 1979లో ఇరాన్ ప్రజలందరూ.. అంటే విద్యార్థులు, కార్మికులు, మత పెద్దలు కలిసి విప్లవం లేవనెత్తారు..! ఆ దెబ్బకు షహా దేశం వదిలి పారిపోయాడు. ఖమేనీ మళ్లీ ఇరాన్ వచ్చి 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్'ను స్థాపించాడు..!

పక్కా నెట్‌వర్క్‌.. 
1979 తర్వాత ఖమేనీ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం చాలా విచిత్రమైనదని చెప్పవచ్చు. అమెరికా, రష్యా వంటి ఏ విదేశీ శక్తి మళ్లీ వచ్చి, తమ దేశాన్ని ఆక్రమించకుండా ఉండటానికి.. ఖమేనీ ఒక పక్కా నెట్‌వర్క్ నిర్మించాడు.

మొదటిది ఫిల్టర్డ్ ప్రజాస్వామ్యం: ఇరాన్‌లో ఎన్నికలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ వీళ్లందరి కంటే పైన సుప్రీమ్ లీడర్ (Supreme Leader) ఉంటాడు. మత కౌన్సిల్‌కు నచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి.

రెండోది.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్: సాధారణ మిలిటరీగా కాకుండా, మత ప్రభుత్వాన్ని కాపాడటానికి సొంతంగా 'IRGC' అనే 5 లక్షల బలగాలున్న ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు.

మూడోది ప్రాక్సీ నెట్‌వర్క్: లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లోని మిలీషియాలు.. పాలస్తీనాలో హమాస్.. ఇలా పశ్చిమాసియా అంతటా తమ ప్రాక్సీ గ్రూపులను తయారు చేసిన ఇరాన్, వాటి ద్వారా అమెరికా-ఇజ్రాయెల్‌లను భయపెట్టడం మొదలుపెట్టింది. ఈరోజు ఇరాన్ వద్ద ఉన్న అణు కార్యక్రమం (Nuclear Program) కూడా.. విదేశీయులు తమపై దాడి చేయకుండా ఉండటానికి వాడుతున్న ఆఖరి ఆయుధమే..!

ఇరాన్‌ విషయంలో ఫైనల్‌గా మనం ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి..! ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం నిరంకుశమైనదే కావచ్చు. కానీ.. ఇరాన్ ప్రజలు వేరు. ఇరాన్ ప్రభుత్వం వేరు..! వివిధ సర్వేల ప్రకారం.. ఇరాన్‌లోని 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ మతఛాందస ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. గత 200 ఏళ్లుగా ఇరాన్ ప్రజలు ఒకవైపు తమ సొంత నిరంకుశ పాలకులు, ఇంకోవైపు తమ స్వార్థం కోసం దేశాన్ని వాడుకున్న అమెరికా, బ్రిటన్, రష్యా వంటి విదేశీ శక్తుల మధ్య నలిగిపోతూనే ఉన్నారు. ఇదీ ఇరాన్ అసలు చరిత్ర.
-హెచ్‌. కమలాపతి రావు, సీనియర్‌ జర్నలిస్టు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)