Breaking News

ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?

Published on Thu, 06/19/2025 - 04:47

కనానాస్కిస్‌: తమ పొరుగుదేశం పాకిస్తాన్‌ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్‌ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై స్పందించకుండా కళ్లు మూసుకొని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని తేలి్చచెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలో జీ7 కూటమి సదస్సులో ‘ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

 సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ముష్కర మూకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండొద్దని ఉద్ఘాటించారు.  ఉగ్రవాదాన్ని పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే గాటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...  
 
నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా?  
‘‘ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలనూ ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తూ మా పొరుగుదేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. 

కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ఉగ్రవాదం మన ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడడం ఏమిటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరం. 

ఇంధన భద్రత మన బాధ్యత  
భవిష్యత్తు తరాల కోసం ఇంధన భద్రత సాధించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఇంధన భద్రత సాధించడం కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు.. పౌరుల పట్ల మన బాధ్యత కూడా. ఇంధనం రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. కలిసి పనిచేయాలి. ‘నేనొక్కడినే కాదు.. మనమంతా’ అనే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు, అనిశి్చత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంధన సరఫరా లేక గ్లోబల్‌ సౌత్‌ దేశాలు నష్టపోవాల్సి వస్తోంది. 

వాటిపై అధిక భారం పడుతోంది. ఆయా దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువులతోపాటు ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. తయారీ, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచ సౌభాగ్యం కోసం ఒక శక్తిగా మార్చాలి. డీప్‌ఫేక్స్‌ పెద్ద ముప్పుగా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఏఐతో సృష్టించే  కంటెంట్‌లో వాటర్‌మార్క్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.  

జీ7 దేశాల అధినేతలతో మోదీ చర్చలు  
కెనడాలో జీ7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యూంగ్, ఫ్రాన్స్‌ అధినేత ఇమ్మానుయేల్‌ మాక్రాన్, బ్రిటిష్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్‌ క్లాడియా షీన్‌బామ్‌ పార్దో, జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇన్సియో లులా డసిల్వా, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ. యూరోపియన్‌ కౌన్నిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులతో మోదీ భేటీ అయ్యారు.   

క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిచ్‌తో చర్చలు   
ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగించుకొని బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. జాగ్రెబ్‌ ఎయిర్‌పోర్టులో క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్‌ ప్లెంకోవిచ్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రొయేషియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోదీయే కావడం విశేషం.  

ట్విట్టర్‌లో పోరాటం సాగిస్తున్నారా?   
కెనడాలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈరోజుల్లో మీరు ట్విట్టర్‌లో పోరాటం సాగిస్తున్నారా? ట్విట్టర్‌లో మీరు చాలా చురుగ్గా ఉంటున్నారు’’ అని మాక్రాన్‌ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మాక్రాన్, మోదీ సైతం బిగ్గరగా నవ్వేశారు. 

ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లినప్పుడు విమానం దిగే సమయంలో మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెట్టా నెట్టివేసినట్లు వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ.. ఇలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి అని మాక్రాన్‌కు సలహా ఇచ్చారు. ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ మోదీ సరదాగా వ్యాఖ్యానించారు.  మోదీ–మాక్రాన్‌ సంభాషణ పట్ల సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ నవ్వుతూ మాట్లాతూనే మాక్రాన్‌కు గట్టిగా చురక అంటించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)