ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్‌ ఘటన!

Published on Thu, 07/09/2026 - 10:49

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచానికి కొత్త అవకాశాలను అందిస్తున్న వేళ.. దాని దుర్వినియోగం మరో కొత్త ముప్పుగా మారుతోంది. ఏఐ సాధనాలను ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన బలం చేకూర్చింది. చాట్‌జీపీటీ సాయంతో ఓ ప్రోగ్రామ్‌ రూపొందించి వేలాది వినియోగదారుల ఖాతాలను ప్రభావితం చేశాడన్న ఆరోపణలతో 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్‌ కావడం ఇక్కడ మరో విశేషం. 

జపాన్‌కు చెందిన ఓ టీనేజర్‌.. ప్రముఖ యానిమే స్ట్రీమింగ్‌ సేవ అయిన బందాయ్‌ ఛానల్‌పై సైబర్‌ దాడికి పాల్పడ్డాడు. చాట్‌జీపీటీ సాయంతో కోడింగ్‌ను బ్రేక్‌ చేసి.. ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్‌ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది.

చాట్‌జీపీటీ సాయంతో కోడ్‌..
టోక్యో మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్న నిందితుడు.. బందాయ్‌ ఛానల్‌ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్‌లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్‌ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్‌ భాషలో పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.

46 వేలకుపైగా ఖాతాల రద్దు
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్‌ 4న బందాయ్‌ ఛానల్‌ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్‌ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్‌లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్‌ ఛానల్‌ వెల్లడించింది.

ఐపీ మార్చి.. ఏమార్చి.. 
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్‌ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్‌ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు.

సరదాగానే..
విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్‌ ఛానల్‌పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్‌ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

చిన్న వయసులోనే కోడింగ్‌ నైపుణ్యం
ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

వినియోగదారులకు హెచ్చరిక
సైబర్‌ దాడి తర్వాత బందాయ్‌ ఛానల్‌ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్‌, ఫిషింగ్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.

ముమ్మాటికీ కొత్త ఆందోళనే!
కృత్రిమ మేధ అందిస్తున్న అవకాశాలతో పాటు.. దాని దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలను సైబర్‌ నేరాలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, దాన్ని తప్పుదోవ పట్టిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని జపాన్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)