రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
సంశయాత్ములు
Published on Mon, 07/06/2026 - 09:31
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.
భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.
ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.
భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి
Tags : 1