Breaking News

అక్షరం మీద ఆగ్రహం

Published on Sun, 06/29/2025 - 03:45

అణచివేత, ఆంక్షలు బ్రిటిష్‌ ఇండియా కాలం నుంచి భారతీయ పత్రికారంగానికి అనుభవమే. ఎమర్జెన్సీ ప్రకటనపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌  అలీ అహ్మద్‌ సంతకం మరొకసారి బ్రిటిష్‌ కాలంనాటి నిర్బంధాలను పున రావృతం చేసింది.  1975 జూన్‌  25 అర్ధరాత్రి భారత పత్రికా రంగం చీకటి తెరలోకి వెళ్లింది. 26న సెన్సార్‌షిప్‌ పేరుతో అణచివేత అధికారికంగా అమలైంది. ఆ రోజు నుంచి 1976 జనవరి 22 వరకు 272 పత్రికల మీద సెన్సార్‌ వేటు పడింది. 

19 మాసాల తరువాత గాని పత్రికారంగం వెలుగు చూడలేదు. 1975లోనే తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరంలోని గోదావరి ఆనకట్ట బీటలు వారింది. ఆ వార్త సైతం సెన్సార్‌ కత్తెరకు గురైంది. 1976 జనవరి నాటి పార్లమెంట్‌ శీతకాల సమావేశాల వార్తలను కూడా సెన్సార్‌ చేసింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ తెచ్చిన సెన్సార్‌ షిప్‌ ఎంత గుడ్డిగా, నిరంకుశంగా సాగిందో చెప్పడానికి ఇవి చాలు. ఎన్ని కీలక వార్తలు కత్తెర పాలైనాయో ప్రఖ్యాత జర్నలిస్ట్‌ కుల్దీప్‌ నయ్యర్‌ ‘ది జడ్జిమెంట్‌’ పుస్తకానికి ఇచ్చిన అనుబంధంలో చూడవచ్చు. దీనికంతకూ బాధ్యత ఇందిరదే.

జూన్‌  26 ఉదయం ఇందిర ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య విధానాలతో సాధారణ పౌరులకు మేలు చేయా లని అనుకుంటే ప్రతిపక్షాలు, పత్రికలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని నేరుగా యుద్ధం ప్రకటించారు. ఆ రోజు నుంచే పత్రికలపై సెన్సార్‌షిప్‌ అమలులోకి వచ్చింది. అత్యధికంగా ఆంగ్ల దినపత్రికలు ఢిల్లీలోని బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లోనే కేంద్రీకృతమై ఉండేవి. 

25వ తేదీ అర్ధరాత్రి ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కన్నాట్‌ప్లేస్‌లోని ‘ది స్టేట్స్‌మన్‌ ’, ‘ది హిందుస్తాన్‌  టైమ్స్‌’, ‘ది ఎకనామికల్‌ టైమ్స్‌’, ‘ది ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రికలు మాత్రం వెలు వడ్డాయి. కన్నాట్‌ ప్లేస్‌ ఢిల్లీ కార్పొరేషన్‌  పరిధిలో కాక ముని సిపల్‌ కార్పొరేషన్‌  పరిధిలో ఉంది.  మునిసి పాలిటీకి కరెంట్‌ కట్‌ చేయలేదు. 

కరెంట్‌ కోత నుంచి పొరపాటున బయపడిన మరో ఆంగ్ల దినపత్రిక ‘మదర్లాండ్‌’. ఈ పత్రిక ఎడిటర్‌ కెఆర్‌ మల్కానీని 25 రాత్రే జేపీ, మొరార్జీలతో పాటే అరెస్టు చేశారు. ఒక ఉగ్రవాదిని పట్టుకున్నంత హడావిడి చేశారు. కాని పత్రిక యాజమాన్యం 26న ప్రత్యేక అనుబంధం ప్రచురించింది. అదే ‘మదర్లాండ్‌’ ఆఖరి సంచిక అయింది. ఎమర్జెన్సీ విధింపు, అర్ధ రాత్రి అరెస్టుల వివరాలతో అనుబంధాన్ని తెచ్చారు. ఉత్కంఠతో ఉన్న ప్రజలు పది పైసల ఆ అనుబంధాన్ని, ఇరవై రూపా యలకు కూడా కొన్నారు. 

అంతవరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఐ.కె. గుజ్రాల్‌కు ఉద్వాసన పలికి, పత్రికలను బుద్ధిగా నడుచు కునేటట్టు చేయగలిగిన సమర్థుడు వీసీ శుక్లాను ఆ పదవిలో నియమించారు ఇందిర. పత్రికలు సెన్సారింగ్‌ను తీవ్రంగా నిర సించాయి. ఇందుకు పరాకాష్ఠ చర్య, సంపాదకీయం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా ఉంచడం. 

వీసీ శుక్లా సమాచార మంత్రిగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఇందిర తొలి శత్రువుగా భావించిన ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌  ఎక్స్‌ప్రెస్‌’ మీద యుద్ధం ప్రారంభించారు. నాటి సంపాదకుడు వీకే నరసింహన్‌  తన రచన ‘డెమాక్రసీ రిడీమ్డ్‌’లో అదంతా వివరించారు. మొదటి అడుగు ఎమర్జెన్సీ తొలినాళ్లలో ఎడిటర్‌గా ఉన్న మూల్గాంవ్‌కర్‌కు ఉద్వాసన పలి కించడం. 

ఆ పత్రికకు విద్యుత్‌ నిలిపివేశారు. ప్రభుత్వ ప్రకటనలు ఆపారు. ఢిల్లీ కార్యాలయాన్ని కూల్చడానికి ఉత్తర్వులు ఇచ్చారు. గుండె జబ్బుతో బాధపడుతున్న భగవాన్‌ దాస్‌ గోయెంకాను అరెస్టు చేస్తామని ఆయన తండ్రి, ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామ్‌నాథ్‌ను బెదిరించారు. అచ్చుకు వెళ్లే ప్రతి పేజీని సెన్సార్‌ అధికారులకు చూపాలని డీఐఆర్‌ 48 (1) నిబంధన విధించి ప్రీ సెన్సార్‌షిప్‌ను ప్రయోగించారు.

పార్లమెంట్‌ ప్రసంగాలను ప్రచురించినందుకు ముంబై కేంద్రంగా వెలువడే  వారపత్రిక ‘ఒపీనియన్‌ ’ (ఎ.డి. గొర్వాలే సంపాదకుడు)పై ప్రభుత్వం కక్షకట్టింది. పత్రికను ముద్రించడానికి ప్రెస్‌ లేకుండా చేశారు పోలీసులు. అయినా సైక్లో స్టయిల్డ్‌ పత్రికను తెచ్చారు. ఆఖరికి ఈ పత్రిక ప్రచురణనే ప్రభుత్వం నిషేధించింది. ఎమర్జెన్సీని, నాటి విధానాలను సీపీఐ బాహాటంగానే సమర్థించింది. 

ఈ పార్టీకి మద్దతుపలికే పత్రికగా ఖ్యాతి ఉన్న పత్రిక, ‘మెయిన్‌ స్ట్రీమ్‌’. నిఖిల్‌ చక్రవర్తి సంపాదకుడు. కానీ ఈ పత్రిక నాడు సీపీఐ వైఖరికి దూరంగా ఉంది. సంజయ్‌గాంధీని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా వెలు వరించిన  ‘డు వుయ్‌ నీడ్‌ నెహ్రూ టుడే’ వంటి వ్యాసాలు సర్కార్‌కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ పత్రికను అచ్చువేసే ప్రెస్‌ను జప్తు చేశారు.

ప్రపంచంలోనే ‘పంచ్‌’ తరువాత ఖ్యాతిగాంచిన కార్టూన్ల పత్రిక ‘శంకర్స్‌ వీక్లీ’. దేశం గర్వించదగిన కార్టూనిస్ట్‌ శంకర్‌పిళ్లై ఈ పత్రిక అధిపతి, ఎడిటర్‌. ఈ వీక్లీ 1975, అక్టోబర్‌లో మూతపడిపోయింది. కారణం – ప్రీ సెన్సార్‌ నిబంధన. వినోబా భావే ‘మైత్రి’, జయ ప్రకాశ్‌ నారాయణ్‌ ‘ఎవ్రీమ్యాన్స్‌’, ఫెర్నాండెజ్‌ ‘ప్రతిపక్ష’... ఎన్నో  శాశ్వతంగానో, తాత్కాలికంగానో ప్రచురణ నిలిపి వేశాయి. తెలుగులో ‘సృజన’, ‘జాగృతి’, ‘పిలుపు’, ‘ప్రజాసమస్యలు’ ఆగిపో యాయి (తరువాత కొన్ని మళ్లీ ప్రచురణ ప్రారంభించాయి).

ఎమర్జెన్సీ విదేశీ విలేకరులను కూడా విడిచి పెట్ట లేదు. అమెరికా వారే ఢిల్లీలో 15 మంది ఉంన్నారు. 25 మంది పశ్చిమ యూరప్‌వారు, 20 మంది తూర్పు యూరప్‌ దేశాల వారు పనిచేసేవారు. పీటర్‌ హాజెల్‌ హ్రస్ట్‌ (లండన్‌  టైమ్స్‌) తరెన్‌  జెండిన్‌ ్స (న్యూస్‌ వీక్‌) పీటర్‌ గిల్‌ (లండన్‌  డెయిలీ టెలిగ్రాఫ్‌)లకు 24 గంటలలో దేశం విడిచి వెళ్లమని ఆదేశించారు. విదేశీ పత్రికలు ఏదో మార్గంలో భారతదేశ వార్తలను ప్రచురించాయి.

దేశంలో  జరుగుతున్నదేమిటో సాక్షాత్తు ప్రధానికి తెలి యకపోవడానికి మూల కారణం సెన్సార్‌షిప్‌. సెన్సార్‌షిప్‌ను తొలగించమని 1975 జూలై 5న తనను కలిసిన ఇండియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌కు ఇందిర చెప్పిన సమా ధానం – దేశాన్ని రక్షించడానికి సెన్సార్‌షిప్‌ విధించానని (ఆరో తేదీ పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయి). 

కానీ జరిగినదేమిటి మారుతి కారు ఉదంతం, స్నేహలతా రెడ్డి విషాదాంతం, పోలీసుల అరాచకాలు, ‘కిస్సా కుర్సీకా’, ‘ఆంధీ’ సినిమాల నిలిపివేతలు, బలవంతపు ఆపరేషన్లు, అరెస్టులు, తుర్క్‌మన్‌ గేట్, పోలీసు కాల్పులు, కూల్చివేతలు... అన్నీ సెన్సార్‌ ఇనుప తెర వెనుక ఉండిపోయాయి.

డా‘‘ గోపరాజు నారాయణరావు 
వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)