Breaking News

ఆ ‘చీకటి’ కోణానికి మరోవైపు...

Published on Wed, 06/25/2025 - 01:01

1975 జూన్‌ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవ త్సరానికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్‌ సర్వే పల్లి రాధాకృష్ణన్‌ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. 

అలాగే 1971 నుండి ’77 వరకూ బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో వి.వి. గిరి ఆత్యయిక స్థితి విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్ట మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన 1966లోనూ, రెండవ సారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితు ల్లోనే ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం లేదు.

1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించ బడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ ‘మచ్చ’ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం.

పాలనకు అవరోధాలు
1966 జనవరి 24న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న ఇందిరకు, కేపిటలిస్ట్‌ భావ జాలాన్ని బలపరిచే మొరార్జీ దేశాయ్‌ వంటి నాయకుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.

1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 1967లో ఇందిర నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్‌ నిలబడే అవకాశాలు కన్పించటం లేదు. 

ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి నెహ్రూ సంకల్పించి, అమలు చేయలేకపోయిన ‘ఆవడి’ కాంగ్రెస్‌ తీర్మానాలను దులిపి బయటకు తీసింది. ఉప ప్రధాని మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా మొరార్జీ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).

వెంటనే బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి రూ. 50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ అయింది. ‘దారిద్య్రాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో సొంత ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. 

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇందిర తెచ్చిన ‘బ్యాంకుల జాతీయీకరణ’ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని లోక్‌సభ ఆమోదించినా... రాజ్య సభలో పాస్‌ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. 

ఇక, 1974లో గుజరాత్‌లోని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో హాస్టల్‌ మెస్‌ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్‌ పటేల్‌ (కాంగ్రెస్‌) వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. పైకి ఈ ఉద్యమం చిమన్‌భాయ్‌ పటేల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ఇది ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమమే!

సాక్షాత్తూ జయప్రకాశ్‌ నారాయణ్‌ రంగంలోకి దిగడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ గాంధేయ విప్లవకారుడు... గుజరాత్‌ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
సరిగ్గా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవు తున్న 1975 జూన్‌ 12 నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. 

రాయబరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాశ్‌ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయ ప్రకాశ్‌ నారాయణ్‌ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకాలన్నారు.

రాజ్యాంగానికి లోబడే...
1975 జూన్‌ 25 అర్ధరాత్రి, ఆర్టికల్‌ 352(1) అనుసరించి భారత రాష్ట్రపతి ‘ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌’ దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతికి ఇందిర అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నాననీ, ఆ విధంగా చేయడం కూడా బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం రూల్‌–12కి లోబడే చేస్తున్నాననీ ఆమె పేర్కొన్నారు. 

రేపు తెల్లవారగానే క్యాబినెట్‌ మీటింగ్‌ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.

ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 1975 జూలై 23న లోక్‌సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది.రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలంగానూ, 59 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు.

ఇప్పటికీ అదొక చీకటి రాజ్యమనీ, ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్‌ 352 తీయ బడిందనీ, ఆ అధికరణం ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్‌ పార్టీయే ‘సారీ’ చెప్పాక అది తప్పే అయి వుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!

యశపాల్‌ కపూర్‌ అనే ‘ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ’ తన రాజీనామాను ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 1971 జనవరి 25న ప్రెసిడెంట్‌ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా ఉంది (విత్‌ రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది. 

సుప్రీంకోర్టులో జస్టిస్‌ కృష్ణయ్యర్‌ వంటి జడ్జి ‘స్టే’ ఇచ్చినా ‘‘లెక్క చేయం... నువ్వు రాజీనామా చేయాల్సిందే’’ అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా? సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపు నివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఓడిపోవటం... నిశ్శబ్దంగా అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో భాగమేనా? దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న మన రాష్ట్రంలో ఇందిర 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి చీకటంటే అంత ఇష్టమా? అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి ప్రభావం ఎందుకు చూపలేదు?

ఎమర్జెన్సీని దేశప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1975 జూన్‌ 26 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగేదా? ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే ఎన్నికలకు పోవడం.

ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం పార్లమెంటులో జరిగింది గానీ... రోడ్ల మీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?

1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్‌సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది, ఒక ‘స్టే’ చెయ్యబడ్డ, పూర్తిగా టెక్నికల్‌ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రధాని గద్దె దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్‌) ఏర్పడుతుంది? స్వతంత్ర, జన్‌సంఘ్‌ వంటి క్యాపిటలిస్టు పార్టీలు సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపె య్యాలి అనుకున్నప్పుడు... లొంగిపోవాలా? తిరగబడాలా?

ఇందిరా గాంధీ తిరగబడింది. పర్యవసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన చేశారో కూడా దేశం చూసింది. ‘ఇందిరా కో బులావో, దేశ్‌ కో బచావో’ (ఇందిరను పిలవండి, దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని చేశారు.

(ఇప్పటికీ 352 ఆర్టికల్‌ చిన్న సవరణతో అలాగే ఉంది. అంతర్గత అలజడులు (ఇంటర్నల్‌ డిస్టర్బెన్స్‌)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్‌›్డ రెబెలియన్‌) అని సవరించడం గమనార్హం!)


ఉండవల్లి అరుణ కుమార్‌ 
వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యుడు(కాంగ్రెస్‌)

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)