Breaking News

రైతాంగం కష్టాలు కొనసాగాల్సిందేనా!

Published on Tue, 06/17/2025 - 00:33

కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరితో సహా 14 పంటలకు అర కొరగా పెంచిన కనీస మద్దతు ధరల ప్రకటన రైతులను ఉస్సూరుమనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన  ధరలను పరిశీలిస్తే, క్వింటాలు వరికి రూ. 69, జొన్నలకు రూ. 328, సజ్జలకు రూ. 150, మొక్కజొన్నకు రూ. 150, కంది పప్పుకు రూ. 450, పెసర్లకు రూ. 86, మిను ములకు రూ. 400, వేరుశనగకు రూ. 480, పొద్దుతిరుగుడుకు రూ.441, సోయాబీన్‌కు రూ. 436, పత్తికి రూ. 589, కుసుమలకు రూ. 579, రాగులకు రూ. 596లు మేర మాత్రమే పెంచారు. ఆశ్చర్యం ఏమంటే ఈసారి పెంపుదల 2024 –25లో పెంచిన దానికంటే తక్కువ ఉండటం.

అన్నదాతకు అన్యాయం జరగడం కొత్త కానప్పటికీ... దాదాపు 3 ఏళ్ల క్రితం మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉరితాళ్ల వంటి 3 వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలపాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు సాగించిన పోరాటం నేపథ్యంలో పంటల కనీస మద్దతు ధరల చట్టబద్ధతపై అవకాశాల పరిశీలన కోసం కమిటీ వేస్తామనీ, కమిటీ సూచనల ప్రకారమే నిర్ణ యాలు తీసుకొంటామనీ ఇచ్చిన రాతపూర్వక హామీకి ఇప్పటివరకు అతీగతీ లేదు. 

సంస్కరణలు అనివార్యం 
కనీస మద్దతు ధరలను నిర్ణయించే ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పంటల ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రాల వారీగా లెక్కించి, దానిని జాతీయ సగటుగా లెక్కించడం సరియైనది కాదు. సాగు ఖర్చులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంది. సగటు లెక్కన ధరలు నిర్ణ యించడం వల్ల ఎక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నది. 

దేశంలో ప్రధాన పంటల సాగు వ్యయాన్ని లెక్కించేందుకు ఎప్పుడో ఏర్పాటైన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైసెస్‌ –  సీఏసీపీ)  వరుసగా మూడేళ్ల పంట సాగు వ్యయాన్ని లెక్కించి, దాని ఆధారంగా కనీస మద్దతు ధరల్ని లెక్కించి... ఆ వివరాలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి నివేదిస్తుంది. ‘సీఏసీపీ’కి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ... ఆ సంస్థ నివేదించే ధరల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించడం లేదు. 

వాటికి సవరణలు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తమ వద్దనే ఉంచుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు సీఏసీపీ పంటల ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడానికి భారీ కసరత్తు జరిపి అందిస్తున్న నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్నప్పుడు... అసలు ఆ సుదీర్ఘ కసరత్తు వల్ల ఒనగూడుతున్న ప్రయోజనం ఏమిటి? వాటికయ్యే ఖర్చు, సమయం వృథా అవడం తప్ప?!

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి ఆరేళ్లు దాటింది. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగంపై ‘నీతి ఆయోగ్‌’ ఓ కార్యాచరణ ప్రణాళికా పత్రాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. కానీ, అది కూడా రైతాంగానికి చేసిన మేలేమీ లేదు. 

2006లో డా‘‘ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ అందించిన సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయానికి 50 శాతం జోడించి కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నమ్మబలికి, మరో వైపు స్వామినాథన్‌ చెప్పిన íసీ2+ 50 శాతం ఫార్ములాను అనుసరించి ఎంఎస్‌పీ ఇస్తే నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారుడి నడ్డి విరుగుతుందంటూ సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసి చేతులు దులుపుకొంది. 

అంతేకాదు... స్వామినాథన్‌ చెప్పిన సీ2+ 50 శాతం ఫార్ములాకు కొత్త భాష్యం చెప్పే దుస్సాహసం చేసింది కూడా! ఉదాహరణకు ఈ ఏడాది క్వింటాలు వరి ఉత్పత్తికి జాతీయ సగటు ఉత్పత్తి వ్యయం రూ. 3,135 అని రైతు సంఘాలు శాస్త్రీయంగా అంచనా వేశాయి. అయితే, తాజాగా కేంద్రం వరికి ప్రకటించిన ఎంఎస్‌పీ రూ. 2,369. అదేవిధంగా పత్తికి రూ. 16 వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం సీఏసీపీకి నివేదిస్తే... కేంద్రం పత్తికి ప్రకటించిన ధర రూ. 7,710కు పరిమితం అయింది. ఈ లెక్కలు అన్ని ప్రధాన పంటలకూ వర్తిస్తాయి.

వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చే అవకాశాలు గతంలో కంటే ఇపుడు ఎక్కువగానే ఉన్నాయి. రైతాంగానికి సాగు ఖర్చును గణ నీయంగా తగ్గించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచే అవకాశాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగుకయ్యే వ్యయాన్ని; చీడ పీడలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల్ని గణనీయంగా తగ్గించవచ్చు. 

చాలా దేశాలు వ్యవసాయరంగంలో బయో టెక్నాలజీని సమర్థంగా వినియోగించి మంచి ఫలితాలు రాబడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ముందుగానే అంచనా వేసే సాంకేతిక పరి జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. నీటికొరత, వర్షపు నీటి ముంపు, తెగుళ్లు వంటి వాటిని సమర్థంగా తట్టుకోగల వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం, యాంత్రీ కరణ గణనీయంగా పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ను ఉపయోగించి ఏ నేల ఏ పంటలకు అనుకూలమో తెలుసుకొని అందుకు అనుగుణమైన పంటలు పండిస్తున్నారు.

ఇక, ప్రధానంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి... దళారీల ప్రమేయం లేకుండా మార్కెట్‌ యార్డులను సమర్థంగా నిర్వహిస్తు న్నారు. పంటల ఉత్పత్తి ధర కంటే మార్కెట్‌ యార్డులో ధర ఎక్కు వగా ఉన్నప్పుడే... దానిని అమ్మాలనే నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారు. అలా జరగడం కోసం పంటకు గిట్టుబాటు ధరను కనీస రిజర్వు ధరగా చట్టపరంగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ రిజర్వు ధర అన్నది ఒకేలా ఉండదు. దిగుబడిని బట్టి రిజర్వు ధర ఆధారపడి ఉంటుంది. 

చైనా, థాయ్‌లాండ్, జపాన్‌ వంటి దేశాలలో సహకార పద్ధతిలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. దాని వల్ల మంచి ధరల కోసం వారు గట్టిగా బేరమాడగలుగుతున్నారు. ఆస్ట్రే లియా, న్యూజిలాండ్‌ లాంటి దేశాల్లో రైతుల తరఫున బేరసారాలు సాగించడానికి ప్రత్యేక డైరక్టర్‌ను అన్ని మార్కెట్‌ యార్డుల్లో నియ మిస్తున్నాయి. ఇటువంటి సదుపాయాలు, వెసులుబాట్ల కారణంగా రైతాంగానికి ఇంతకు ముందు లేని రక్షణ కలుగుతోంది. ఈ విధానా లన్నీ మన దేశంలో కూడా అమలు చేసినట్లయితే... రైతులకు మేలు జరుగుతుంది.

డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)