Breaking News

మాటలు కోటలు... మారని చర్యలు

Published on Thu, 07/02/2026 - 01:00

నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్‌ సాయిల్‌ హెల్త్‌ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్‌’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?

నేల ఏం చెప్తోందంటే...
2015లో ప్రారంభమైన సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్‌ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్‌ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.

ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. 

ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమ
తెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్‌ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్‌ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.

అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.

‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?
నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్‌ హెల్త్‌ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్‌ క్రెడిట్స్‌ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్‌ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్‌లైన్‌(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్‌ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్‌ సాయిల్‌ హెల్త్‌ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. 

మాటలు మారితే చర్యలూ మారాలి!
కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్‌పీఓ(ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనై జేషన్‌)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్‌ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్‌బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.

డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)