Breaking News

నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం

Published on Fri, 06/20/2025 - 00:53

ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. 

ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. 

ఈలోగా మన వాట్సప్‌ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.

ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. 

ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనల
గురించీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. 

విమానాల నిర్వహణలో, కాక్‌ పిట్‌ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. 

అహ్మదాబాద్‌ సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్‌ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. 

రన్‌ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్‌లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థి వసతిగృహం. 

అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్‌ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్‌ సమయంలో ఫాన్‌లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్‌ హోల్స్‌ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. 

అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్‌ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. 

అంతకు ముందే 2018లో ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ గుజరాత్‌ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్‌ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్‌ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.

ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.

విజయ్‌ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! 

ఎన్‌. వేణుగోపాల్‌ 
వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)