నూతన యూరియా విధాన సవాళ్లు

Published on Sat, 08/01/2026 - 13:46

హార్మూజ్‌ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్‌ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.

వేసిన నత్రజని పనికొచ్చేనా?
తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?

గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.

మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్‌ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.

ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్‌పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.

నిజంగా ఇది స్వావలంబనా?
నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్‌ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.

అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్‌ గ్యాస్‌ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్‌ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.

నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.

జీవసారం పెంచితే ప్రోత్సాహకాలు
ఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?

ఒక టన్ను యూరియా ఒక్క సీజన్‌ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.

అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్‌ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.

‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్‌ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్‌ పైప్‌లైన్‌ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. 

- డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ) కార్యనిర్వాహక సంచాలకులు

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)