ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?

Published on Sun, 07/05/2026 - 12:35

ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్‌ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ ఆర్‌–15048), కునారం సన్నాలు (కేఎన్‌ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్‌–44 (సిద్ధి), కేఎన్‌ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. మిల్లింగ్‌ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్‌ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్‌ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్‌ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.

రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్‌ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.

తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్‌ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.

ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్‌ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్‌ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్‌ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?

వైవిధ్యమే రైతుకు రక్షణ
వికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్‌ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.

ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.

ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్‌ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో...  రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.


- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్‌షెడ్‌ సపోర్ట్‌ సర్విసెస్‌ అండ్‌ యాక్టివిటీస్‌ నెట్‌వర్క్‌ (వాసన్‌) అసోసియేట్‌ డైరెక్టర్‌

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)