నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
సహజమైనదే చేయాలి!
Published on Tue, 07/28/2026 - 08:54
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.
ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.
‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.
– యామిజాల జగదీశ్
Tags : 1