Breaking News

అల వైకుంఠ పురంలో..లక్ష్మీ కటాక్షం

Published on Fri, 07/04/2025 - 11:40

లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చునన్న నమ్మకానికి సాక్షాత్తూ వేదసూక్తాల సాక్ష్యం ఉంది. బ్రహ్మ, ఇంద్ర, గంగాధరుల వైభవం కూడా శ్రీదేవి మెల్లని కడగంటి చూపు వల్ల లభించిందే (శ్రీమత్‌ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మ ఇంద్ర గంగాధరమ్‌...) అని ఆస్తికులు విశ్వసిస్తారు. ఆమె కటాక్షానికి అంతటి శక్తి కలగటం వెనక గల కీలకాన్ని ఆదిశంకరులు కవితాత్మకంగా అభివర్ణించారు. 

అల వైకుంఠ పురంలో నెలవైన ఆ శ్రీహరి రూపం మీద, మహాలక్ష్మి చల్లని నల్లని కంటి చూపు సోకిందట. మగువల వీక్షణలు తుమ్మెదల బారులా నల్లగా ఉన్నట్లు భావించటం కవిత్వ సంప్రదాయం, ‘కవి సమయం’. ఆమె క్రీగంటి చూపు తనను తాకగానే హరి పులకించి పోయాడు. ఆయన నిగనిగల శరీరం మీద ఆ పులకలు స్ఫుటంగా కనిపించాయి. నల్లని, దృఢమైన తమాల వృక్షం మీద విరివిగా అంకురించిన చిన్ని చిన్ని మొగ్గల గుత్తుల లాగా కనిపించాయి. 

ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్‌

స్వామి పులకలను తాకిన సరసిజాక్షి వీక్షణలు, అరవిరిసిన ఆ మొగ్గలను ఆశ్రయించిన తుమ్మెదల లాగా కనిపించాయి. తుమ్మెద పువ్వులో మకరందాన్ని స్వీకరించి తనలో నింపుకొంటుంది. అలాగే, సకల సంపదలకూ, విభూతులకూ ఆకరమైన జగన్నాథుడి మీద సోకిన వీక్షణం, ఆ సంపదలనూ, విభూతులనూ కానుకగా అంగీకరించి, స్వీకరించింది. ‘అంగీ’కృతం– అంటే తన శరీరంలో భాగం చేసుకున్నది. 

అంగం హరేః పులక భూషణం ఆశ్రయంతీ,
భృంగ అంగనా ఇవ ముకుల  ఆభరణం తమాలం,
అంగీకృత అఖిల విభూతిః అపాంగ లీలా
మాంగల్యదా అస్తు మమ, మంగళ దేవతాయాః!

ముకుళములు (మొగ్గలు) ఆభరణంగా గల తమాల వృక్షాన్ని ఆడు తుమ్మెద ఆశ్రయించినట్టు, నారాయణుడి పులకలెత్తిన శరీరాన్ని ఆశ్రయిస్తూ, ఆయన అఖండ విభూతులను స్వీకరించి తనలో ‘అంగీ’భూతం చేసుకున్న మా మంగళ దేవత మహాలక్ష్మి కడగంటి చూపుల లీలా విలాసం, నాకు మంగళ ప్రదాయకము అగుగాక! 

ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?

మంగళ దేవతాయాః అపాంగలీలా, మమ మాంగల్యదా అస్తు! ఎంత చింతన చేస్తే అంత మనోహరంగా అనిపించే ఇంతటి అద్భుతమైన ఉత్ప్రేక్ష చేసినప్పుడు, ఆది శంకరాచార్యులకు పట్టుమని పదేళ్ళు కూడా లేవంటారు. పేదరాలి ఇంట సిరులు కురిపించేందుకు, ఆచార్యుల వారు ఆలపించిన ‘కనకధారా స్తోత్రం’లో మకుటాయమానమైన మొదట  శ్లోకం ఇది.
– మారుతి శాస్త్రి 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)