వెలుగుతూ ఉంటావు ఒక దివ్వెగా...

Published on Sun, 07/12/2026 - 05:52

నేడు లక్షల ఇళ్లలో రేడియో వాల్యూమ్‌ తగ్గిపోయింది. కోట్లాది గుండెల్లో ప్రతిధ్వనించిన గాన విశ్వవిద్యాలయం మూగబోయింది. ఆ సింపుల్‌ చీర... ఆ చిరునవ్వు కానరావు. ఆ ప్రవాహస్వరం వినుటకు దొరకదు. ‘వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా...  నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా... తొలి నవ్వుగా’.. అని వాగ్దానం చేస్తూ జానకమ్మ స్వరవాయులీనంలో ఐక్యమైంది. ఆమెకు నివాళి.

జానకి గురించి ఇలా మొదలెట్టొచ్చు. మహా సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ ఒక పాట రికార్డ్‌ చేస్తున్నారు ఆమెతో. తెలుగులో వచ్చిన ‘ఇది కథ కాదు’కు తమిళ వెర్షన్‌ ‘అవర్‌గళ్‌’లోని ‘గాలికదుపు లేదు’ పాట అది. ఆ పాట హైపిచ్‌లో ఉంటుంది. పాట ఎత్తుకోవడమే గమకాలతో ఆలాపన ఉంటుంది. ఎస్‌. జానకీకి అవన్నీ ఏం పట్టె? మంచినీటి గ్లాసు. ఆమె గొంతు విప్పి స్పీకర్లు అదిరేలా ‘గాలికదుపు లేదు’ పాడి సింగిల్‌ టేక్‌లో ఓకే చేసింది.

ఈ అమ్మాయికి ఇంత టాలెంట్‌ ఏమిటని మెల్లగా పంచెకట్టు సర్దుకుంటూ రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి బయటకి వచ్చిన విశ్వనాథన్‌ హడలిపోయారు.
బయట బీభత్సమైన గాలి. హోరు వాన. ఆయన టక్కున లోపలికొచ్చి జానకికి ఒక నమస్కారం పెట్టారు. ‘తల్లీ... ఇకపై నీ చేత ఆచి తూచి పాడించాలి. పంచభూతాలను కూడా కదిలించే శక్తి నీ పాటకు ఉంది’.

1962.
తమిళ సినిమా ‘కొంజుం సలంగై’. ఇందులో హీరోయిన్‌ సావిత్రి తమిళ సన్నాయి విద్వాంసుడైన జెమినీ గణేశన్‌ తోడుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడాలి. సంగీత దర్శకుడు సుబ్బయ్య నాయుడు పాటైతే కట్టాడు గానీ పాడే గాయని ఎవరు? పి. లీల దగ్గరకు వెళితే ‘అంత శ్రుతిలో పాడలేను’ అని ఓటమి అంగీకరించారు. విజేత ఎవరో ఆచూకీ ఇచ్చారు... ఎస్‌. జానకి. ‘నీ లీల పాడెద దేవా’.... కారుకురిచ్చి అరుణాచలం నాదస్వరానికి దీటుగా మహా మేటిగా. సన్నాయి వింటే జానకి గొంతు గుర్తుకు వస్తుంది తెలుగు వారికి.

‘పగలే వెన్నెల జగమే ఊయల’...
జానకి తన పాటలతో అలా పగలే వెన్నెల తెచ్చింది సినిమాల్లో. ఏరు పరిగెత్తినంత చులాగ్గా ఆమె పాడుతుంటే శ్రోతలు శిశువులయ్యారు. శిశువులు కూడా శిరస్సులూపారు. ఎవరు ఈ జానకి అని అందరూ ఆరాలు తీశారు. ఈ జానకి  రేపల్లె దగ్గర పుట్టింది. గోదావరి, కృష్ణాతీరాల మధ్య పెరిగింది. సిరిసిల్లా మగ్గం సవ్వడిలో లయను పట్టుకుంది. ఆంధ్ర, తెలంగాణ... రెండు చోట్లా సంగీతాన్ని తెలుసుకుంది. ‘గురువులు రాగాల ప్రాథమిక సూత్రాలు నేర్పితే... సృష్టిలోని భావాలన్నింటినీ ఈశ్వరుడే నా గొంతులో నింపాడు’ అని తెలుసుకుంది. ఇక మద్రాసుకు ప్రయాణం కట్టింది.

చెన్నైకి చేరేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు. చేతిలో పెద్దగా డబ్బుల్లేవు. కేవలం గొంతుని  నమ్ముకుంది. అప్పట్లో లబ్ధప్రతిష్ఠులైన ఏవీఎం స్టూడియోస్‌ వారు నిర్వహించిన వాయిస్‌ ఆడిషన్స్‌లో జానకి గొంతు విని సంగీత దర్శకులు నిర్ఘాంతపోయారు. నెలకు వంద రూపాయల జీతంతో ఆమెను స్టూడియో ప్యానెల్‌ సింగర్‌గా చేర్చుకున్నారు. 1957లో ‘విధియిన్‌ విలయాట్టు’ అనే తమిళ సినిమాతో ప్రస్థానం మొదలైంది. అదే ఏడాది తెలుగులో ‘ఎమ్మెల్యే’ (1957) అనే చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘నీ ఆశ అడియాస’ పాడింది. జానకమ్మ పాడిన తీరు చూసి, మద్రాస్‌ సినీ సంగీతం ఆమెకు వాకిలి తీసి స్వాగతం పలికింది. 

జానకమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నాటికి తెలుగు, తమిళ పరిశ్రమలను పి. సుశీల, పి. లీల ఏలుతున్నారు. ముఖ్యంగా పి. సుశీల స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, తిరుగులేని గానం మధ్య కొత్తగా వచ్చిన జానకి నిలదొక్కుకోవడం సామాన్యం కాదు. కానీ జానకమ్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్త్రాన్ని ఎంచుకున్నారు... అదే ‘వాయిస్‌ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్ ’. సుశీలగారు క్లాసిక్‌ గాంధర్వ గాత్రంతో అలరిస్తే, జానకి ఒకే రోజు రికార్డింగ్‌లో అల్లరి, కరుణ, శోకం, శృంగారం పలికించేవారు. సుశీలతో పోటీని ఈర్ష్యతో కాకుండా తన విలక్షణమైన గొంతు మార్పిడి విద్యతో ఎదుర్కొని, ఎవరికీ సాధ్యం కాని ‘క్వీన్  ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్ ’గా తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని లిఖించుకున్నారు. 

తెలుగులో ఎన్ని హిట్‌ పాటలు జానకి వశమయ్యాయి. ‘పిలువకురా అలుగకురా’, ‘పగలే వెన్నెల’, ‘నీలి మేఘాలలో’... ‘గున్నమామిడి కొమ్మ మీద’... ‘నాంపల్లి టేషనుకాడి’.... సుశీలను ఎంతో అభిమానించే ఎం.ఎస్‌. విశ్వనాథన్  జానకికి అద్భుతమైన పాటలు తెలుగు, తమిళంలో ఇచ్చారు. ‘అందమైన లోకమని రంగు రంగులుంటాయనీ’, ‘కన్నెపిల్లవని వన్నెలున్నవని’..... శ్రోతలకు ఇష్టం. మరోవైపు తెలుగులో చక్రవర్తి, రమేష్‌ నాయుడు తదితర సంగీత దర్శకులు ఆమెకు ఎక్కువ పాటలు ఇచ్చారు. చక్రవర్తి సంగీతదర్శకత్వంలో పాడిన ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాట జాగృత గీతంలా నిలిచింది. చక్రవర్తి సంగీతంలోనే ‘జ్యోతి’ కోసం చేసిన ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ పాటలో జానకి నవ్వు మరొకరు ఇమిటేట్‌ చేయలేనిది. రమేష్‌ నాయుడు సంగీతంలో పాడిన ‘సిగ్గు పూబంతి’, ‘అలివేణి ఆణిముత్యమా’... క్లాసిక్స్‌. రాజన్  నాగేంద్రలు ఎస్‌. జానకితో చాలా పాటలు పాడించారు. ‘అబ్బో నేరేడు పళ్లు’, ‘కాస్తందుకో దరఖాస్తందుకో’... ఎంతో మధురంగా ఉంటాయి. కానీ ఎస్‌. జానకిని తెలుగువారికి నిజంగా పరిచయం చేసింది ఇళయరాజానే. 

‘భద్రకాళి’తో తెలుగులో రంగప్రవేశం చేసిన ఇళయరాజా స్ట్రయిట్, డబ్బింగ్‌ చిత్రాల్లో జానకి చేత పాడించి, ఆమె విశ్వరూపం చూపించారు. ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’, ‘మౌనమేలనోయి’, ‘ఏవేవో కలలు కన్నాను’, ‘అరె ఏమైంది ఒక మనసుకు’, ‘ఓం నమశ్శివాయ’... లెక్కేలేదు. ఇళయరాజా కచ్చేరీలో చెప్పారు – ‘వెన్నెల్లో గోదారి అందం’... తనకు అంటే రాజాకు కావలసిన పిచ్‌లో పాడటానికి జానకి పంతం పట్టి 14 టేకులు తీసుకుందట. అంతకు ముందు రెండు గంటల పాటు ఆమె ఆ పాటను సాధన చేసింది. తర్వాత 14 సార్లు పాడింది. ‘గొప్పగా పాడటం ఎలాగూ ఉండేదే. ఏకకాలంలో అన్ని గంటలు ఆ స్థాయిలో పాడే శక్తిఎక్కడిదా!’ అని చకితుడయ్యారా వేయి తపస్సుల రుషి.  

‘గోవులు తెల్లన గోపయ్య నల్లన’... పాటలో ఆమె చిన్నపాపలా పాడింది. ఒక తమిళ డబ్బింగ్‌ కోసం అబ్బాయి గొంతులో ‘పాప పేరు మల్లి... మా ఊరు కొత్త ఢిల్లీ’ పాడింది. ‘శ్రీవారి శోభనం’ సినిమాలో ‘అలక పానుపు ఎక్కనేల’ పాటలో పండు ముదుసలిలా గొంతును ఒణికించింది. ఏది పాడినా భావం హృదయాన్ని తాకుతుంది. ఇళయరాజా సంగీతంలో ‘భావనలొకటై’ పాటలో బాలూ పాడుతుంటే పాటంతా హమ్‌ చేస్తుంది జానకి. ఇవాళ్టికీ అలా మరొకరు చేయలేరు.

బాలూ జానకిలది అద్భుతమైన గాత్రద్వయం. వాళ్ల డ్యూయెట్స్‌కు ఫాన్ ్స జాస్తి. ‘ఏమని నే చెలి పాడుదును’, ‘ఉరకలై గోదావరి’, ‘నిరంతరమూ వసంతములే’, ‘మాట రాని మౌనమిది’, ‘ఎదలో తొలి వలపే’, ‘నీ చేతులలో తలవాల్చి’, ‘రాశాను ప్రేమలేఖలెన్నో’... ఒకటా రెండా... గూడూరు పాటల పోటీలో ‘పాల కడలిపై శేషతల్పమున’ పాడిన నూనూగు మీసాల బాలూకు ప్రైజ్‌ ఇచ్చి ‘పనికొస్తావ్‌’ అని ఆశీర్వదించింది జానకమ్మే. 

2013లో కేంద్ర ప్రభుత్వం జానకమ్మకు ‘పద్మభూషణ్‌’ ప్రకటించింది. కానీ ఆ సమయానికే ఆమె ఆరు దశాబ్దాల పాటు సంగీత సేవ చేసి అలసిపోయి ఉన్నారు. ‘దక్షిణాది కళాకారులకు ఢిల్లీ గుర్తింపు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది.  నా దేశ ప్రజల ప్రేమే నాకు అతి పెద్ద అవార్డు, నా అర్హతకు ‘భారతరత్న’ ఇవ్వాలి కానీ ఇది కాదు’ అని ఆ పురస్కారాన్ని సున్నితంగా, అంతే ఆత్మాభిమానంతో తిరస్కరించి సంచలనం సృష్టించింది. 

2016లో మైసూర్‌ వేదికగా జరిగిన ఒక ప్రదర్శనలో... ‘నా గొంతు బాగున్నప్పుడే నేను మైక్‌ వదిలేయాలి, పాడలేక పాడుతోంది అనే మాట నా శ్రోతల నుంచి రాకూడదు’ అని ప్రకటిస్తూ ఆమె హుందాగా ‘సంగీత సన్యాసం’ తీసుకుంది. మధ్యలో ఒకటి రెండు పాడినా అప్పటి నుంచి మైసూర్‌లోని బోగడిలో ఉన్న తన బంధువుల నివాసంలో ప్రశాంతమైన శేష జీవితాన్ని గడిపింది. వృద్ధాప్య సమస్యలతో మైసూర్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స ΄÷ందుతూ శనివారం సాయంత్రం కన్నుమూసింది. భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోవచ్చు... కానీ ఆమె పాట అమరమై, శ్రోతలు ఉన్నంత కాలం జీవించే ఉంటుంది. 

జోహార్లు జానకమ్మ! 
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా....

‘నాన్ –మలయాళీ’ సంచలనం!
ఒక భాషకు చెందని గాయని ఆ భాషలో అత్యధిక అవార్డులు సాధించడం దాదాపు అసాధ్యం. కానీ జానకమ్మ మలయాళంలో సృష్టించిన రికార్డు ఎవరూ బ్రేక్‌ చేయలేరు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గాయని అవార్డును ఆమె ఏకంగా 11సార్లు గెలుచుకున్నారు. కేరళ ప్రజలు ఆమెను ’జానకి అమ్మ’ అని పిలుస్తూ, ఆమె మాతృభాష తెలుగు అంటే నమ్మేవారు కాదు. అంతలా ఆమె మలయాళ ఉచ్చారణను శ్రద్ధతో నేర్చుకుని పాడేవారు.

పదేళ్ల క్రితమే జానకి గాయనిగా రిటైర్మెంట్‌ ప్రకటించారు. మలయాళ చిత్రం ‘పత్తు కల్పనకల్‌’  (2016)లో ’అమ్మపూవిను’ అనే పాట పాడారామె, ఆ తర్వాత విరామం ప్రకటించారు జానకి. అయితే దర్శక–నిర్మాతల విన్నపం మేరకు తమిళ చిత్రం ‘పన్నాడి’ (2018)లో ‘ఉన్‌ ఉసురు కాత్తులే’ అనే పాట పాడారు, జానకి కెరీర్‌లో ఇదే చివరి పాట.

సుశీల– జానకి
పి. సుశీల, జానకమ్మల మధ్య ఎడం ఉందని కొందరు అనుకుంటారు. కానీ సుశీల జానకిని ఎప్పుడూ మెచ్చుకుంటారు. ‘మెలోడీ పాటలు నేను పాడగలనేమో కానీ... ఒకే పాటలో వంద రకాల ఎక్స్‌ప్రెషన్స్ జానకికి మాత్రమే సాధ్యం. వాయిస్‌ మాడ్యులేషన్  విద్యలో జానకి తర్వాతే ఎవరైనా! ఆమెతో నాకు ఎప్పుడూ పోటీ లేదు, ఆమె నా చెల్లెలు’ అని సుశీల  ఓపెన్ గా చెప్పారు.

అవార్డుల ఫంక్షన్ లో జానకమ్మకు ఒక అవార్డు వచ్చినప్పుడు, స్టేజ్‌ మీద ఉన్న సుశీల స్వయంగా జానకికి దిష్టి తీసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు. అప్పట్లో ఈ ఫోటో తమిళ పత్రికల్లో మొదటి పేజీలో వచ్చి సంచలనం సృష్టించింది. సుశీల జానకి పాడిన ‘ఆరనీకుమా ఈ దీపం’ వంటి పాటలెన్నో సూపర్‌హిట్‌గా నిలిచాయి.

అచ్చం వృద్ధురాలిలానే పాడిన జానకి
చిన్న పిల్లల గొంతుతో పాడిన జానకి ఓ సినిమాలో అచ్చం వృద్ధురాలిలానే పాడారు. ఇది ఆమె కెరీర్‌లో అత్యంత విలక్షణమైన ప్రయోగం అని చెప్పొచ్చు. 1979లో వచ్చిన తమిళ చిత్రం ‘ఉదిరి పూక్కళ్‌’లో జానకి ‘పోడా పోడా పోక్కే...’ అంటూ వృద్ధురాలిలా పాడారు. ఒక వృద్ధురాలి గొంతుతో పాడి, శ్రోతలను ఆశ్చర్యపరిచారామె.  జానకికి ఉన్న అసాధారణ ప్రతిభకు ఈ పాట ఒక నిలువెత్తు నిదర్శనం.

ఖదీర్‌ 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)