Breaking News

చేదు మేసి నెమరేసిన రచయిత!

Published on Sun, 07/05/2026 - 09:37

‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు మాసపు అసురసంజ వేళల్లో ఏదో విద్యుద్వాహిని ప్యారిస్‌ వీథుల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు ముసురుపట్టి చినుకులు పడుతున్నా, నా మనసేం కుంగిపోదు! అలాగని కాలం పిట్ట రెక్కలమీద ఎగురుతున్నట్లూ అనిపించదు!!

అలాంటి వేళల్లో ఏం జరిగినా జరగొచ్చని మాత్రమే అనిపిస్తుంది నాకు. నా వరకూ నాకు, అక్టోబరులోనే నూతన సంవత్సరానికి తెర తీస్తున్నట్లు భావిస్తాన’న్న రచయిత ఏ భావకవిగారో కాదు సుమా! అతగాడు ఫక్తు నవలా రచయిత! 2014లో నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ప్యాట్రిక్‌ మొద్యానా చారిత్రక కాల్పనిక నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు. ఆయన రాసిన నాలుగు పదులకు మించిన పుస్తకాలన్నింటా ప్రాథమిక ఇతివృత్తం దాదాపు ఒకటే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ ప్రజలు పడ్డపాట్లకే ఒకింత కాల్పనికత మేళవించి, మొద్యానా ఈ నవలలు రాశాడు. ‘చేజారిన యవ్వనం కెఫేలో...’ అనే నవలలో రాసినవే పైన ఉట్టంకించిన మాటలు.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు ఎనిమిది కోట్లమంది జనం ఉన్నవూరికీ, కన్నవారికీ, కట్టుకున్నవారికీ, కన్న బిడ్డలకూ, చేసుకునే వృత్తులకూ దూరమై అలమటించారు. ఈ యుద్ధానికి ప్రధాన రణక్షేత్రంగా ఉండిన యూరపులోనే ఇలాంటి బాధితుల సంఖ్య సగానికి సగం వుంటుంది. యుద్ధబాధితుల్లో సగానికి సగం మంది స్త్రీ– శిశు– వృద్ధులే! ముఖ్యంగా, వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో బంధితులైన స్త్రీపురుషుల సంతానం అకస్మాత్తుగా అనాథలుగా మారి, నడివీథిలో నిలబడవలసి వచ్చింది. అలాంటి వారిలో, 1945లో పుట్టిన మొద్యానా కూడా ఒకడు.

ఈ యుద్ధం సందర్భంగానే, అరవై లక్షలమంది యూదులను ఊచకోత కోశారు. మొద్యానా తండ్రి ఆల్బెర్ట్‌ కూడా యూదు మతస్థుడే; ఇటాలియన్‌ కులీన వంశానికి చెందిన ఆల్బెర్ట్‌ నాజీలతో చేతులు కలిపినవాడు. అతని తల్లి లూయిజా ఫ్లెమిష్‌ (బెల్జియన్‌–డచ్‌) సాంప్రదాయిక నర్తకి. ఫ్రాన్స్‌ విదేశీ దురాక్రమణకు గురైన రోజుల్లో, 1942లో, వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రణయానికీ, పరిణయానికీ దారితీసింది. యుద్ధకాలంలో, మొద్యానా తండ్రి కార్లాంగ్‌ అనే ఫ్రెంచ్‌ గెశ్టాపో ఆశీర్వాద బలంతో– బ్లాక్‌ మార్కెట్లో వీరవిహారం చేశాడంటారు. కార్లాంగ్‌ సారథులు, నేర ప్రపంచంలో కొమ్ములు తిరిగిన దున్నపోతులై వుండడం వల్లనే, ఇది సాధ్యమైందని కూడా చెప్తారు!


రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మొద్యానా తల్లితండ్రులు కారనేది వాస్తవం! అయితే ఆ యుద్ధ పరిణామాల వల్ల, మొద్యానా మాదిరిగా, ‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కూనలు’ ఎందరో అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందనే మాట కూడా వాస్తవమే మరి! అందుకే, మొద్యానా తన తల్లిదండ్రుల తరాన్ని జీవితంలో ఎన్నడూ క్షమించలేదు!! ఫ్రాన్స్‌లో చిన్నాపెద్దా ఊళ్ళకు కూడా మొద్యానా పేరును పరిచయం చేసిన ‘మాయమైన మనిషి’ లాంటి నవలలు మొదలుకొని ‘డారా బ్రూడర్‌’, ‘ముక్కలైన వాక్యాలు (మూడు నవలల సంపుటి)’, ‘కనిపించని సిరా’– ఇలా ఏ నవలను చూసినా ఇదే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

నోబెల్‌ ప్రైజ్‌ పొందిన తర్వాత, అనేక భాషల్లోకి అనువాదమైన మొద్యానా 139 పుస్తకాలలో దేన్ని చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. పైపైన చూస్తే మొద్యానా రాసింది అపరాధ పరిశోధన సాహిత్యం అనిపిస్తుంది. అయితే, ఆ ‘అపరాధం’ చట్టాలు నిషేధించిన నేరాలు చేయడమే కాదు– స్త్రీలనూ, బాలలనూ– వృద్ధులనూ వేధించిన కండకావరం! దాన్ని నిరసించడానికే మొద్యానా తన సాహిత్య జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు. అయితే, ఆ విషయం వాచ్యంగా చెప్పకుండా, సాహిత్య మర్యాదలన్నీ పాటించడంలో మొద్యానా శిల్ప పరిణతి కనిపిస్తుంది. అందువల్లనే ఈ అపరాధ పరిశోధక రచయితకు నోబెల్‌ పురస్కారం దక్కింది!

మొద్యానా చవిచూసిన చేదు అనుభవాల్లో, ఘోరాతి ఘోరమైన విషయాలున్నాయి. అతన్ని పెంచి పెద్ద చేయడం ‘పెనుభారం’గా అటు తల్లీ, ఇటు తండ్రీ కూడా భావించడం వాటిలో మొదటిది. సదరు భారాన్ని తమ నెత్తిమీంచి దించి, ఎదుటివారి నెత్తిన మోపేందుకు నానా పాట్లూ పడ్డం రెండో ఘోరం. సహాయం కోరి ఆశ్రయించిన పాపానికి, మొద్యానాను తాము విదిలించి పారేయడమే కాకుండా, తమ బాయ్‌ ఫ్రెండ్సూ– గర్ల్‌ ఫ్రెండ్సూ చేత కూడా అదే సత్కారం జరిపించడం ఘోరాతి ఘోరం! ఇంత జరిగిన తర్వాత, తన తల్లితండ్రుల తరాన్ని అసహ్యించుకున్నందుకు మొద్యానాను ఎవరైనా తప్పు పట్టగలరా? సొంత అనుభవాలే పూర్వరంగంగా ఆనాటి ఫ్రాన్స్‌లో రచయితగా మనగలగడం మజాకా కాదు.

ఆధునిక ఫ్రెంచ్‌ వాడుకభాషను ఓ మలుపుతిప్పిన రేమన్‌ కెనో, మొద్యానా తల్లికి నేస్తం; మొద్యానాకు గురువు. అతని చలవతోనే, మొద్యానా తన తొలినవల ‘నక్షత్ర కూడలి’ అచ్చువేయించుకున్నాడు. అందులో ప్రధాన పాత్రలు మొద్యానా తండ్రిని పోలివుండడం మింగుడు పడనందువల్లనే ఆ పెద్దమనిషి సదరు నవల కాపీలు దొరికినన్ని కొనేసి తగలబెట్టేశాడట!

‘దురాక్రమణ పాలైన ప్రాంతాల్లో జీవప్రపంచం అనుభవించిన స్థితిగతులనూ, ఎవరికీ బోధపడని మానవాళి భవితనూ సొంత జ్ఞాపకాల ప్రాతిపదికగా మన కళ్ళముందు ఉంచిన కళ మొద్యానా సొంతమ’న్నారు స్వీడిష్‌ ఎకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్‌ ఇంగ్లండ్‌. ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మొద్యానా మరెక్కడా ప్రాచుర్యానికి నోచుకోలేదని 2014లో పీటర్‌ ఇంగ్లండ్‌ అన్నమాట వాస్తవమే. అయితే యేం? నోబెల్‌ పురస్కారం కోసం నామినేట్‌ అయిన తొలిసారే, అతన్ని ఆ బహుమతి వరించడం కూడా వాస్తవమే మరి! - మందలపర్తి కిషోర్‌

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)