"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్‌గా..!
Published on Thu, 04/16/2026 - 10:44
వైవాహిక జీవితంలో ముసిరిన చీకట్లు ఊపిరి సలపనివ్వలేదు. పోనీ పిల్లలు పుట్టాకన్నా.. తన స్థితి మారుతుందనుకుంటే మరింత నరకప్రాయమైంది. చేతిలో ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండాలా? బయటకు వచ్చేయాలా? అన్న మీమాంస..ఇక తప్పని స్థితిలో ఇంటి నుంచి ఒంటరిగా ఇద్దరి పిల్లలతో బయటపడింది. అలా అనాడు నిస్సహాయ స్థితిలో అందరి జాలి చూపులతో కనిపించిన ఆ అభాగ్యురాలు.. ఇవాళ అందరు చేతులెత్తి సలాం కొట్టే పొజిషన్‌కి చేరుకుంది. ఓ జిల్లాకే అధికారిగా పాలన చేస్తూ..స్ఫూర్తిగా నిలిచారామె. పరిస్థితులు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయేమో..కానీ మన మనః స్థితిని కాదు అని అంటారామె.
ఆ అసామన్య ధీరురాలే సవితా ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా మడై గ్రామంలో ఓ ఆదివాసి కుటుంబంలో పెరిగారు. తండ్రి వరి కోయడం, బీడి ఆకులు ఏరడం, మహువా పువ్వులు సేకరించడం వంటి పనులు చేస్తుంటాడు. ఓ పల్లెటూరి అమ్మాయిలా పెరిగినా సవితా ఇంటర్ పూర్తి చేసిన కొద్ది రోజులకే 16వ ఏటనే పెళ్లి చేశారు. అది కూడా తన కంటే పదకొండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేశారు. అయితే అత్తగారింట్లో ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది.
భర్త, అత్తమామలు, ఆడపడచు వేధింపులకు తాళ్లలేకపోయింది. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పేవారు తల్లిదండ్రులు. ఇద్దరు కుమారులు అథర్వ, యూజుస్‌లు పుట్టాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా, మరింత దిగజారింది. ఇక తన వల్ల కాదంటూ ఇద్దరు పిల్లలతో బయటకొచ్చేసింది. చాలా తక్కువ వస్తువులతో బయటకొచ్చిన ఆమె ఒక బంధువు ఇంట్లో చేరి స్థానిక బ్యూటీపార్లర్‌లో పనిచేసింది. అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న సవితకు ఎలాంటి భరోసా లేదు. కనీసం ఆర్థిక సాయం కూడా లేదు. పైగా ముందుకు సాగడానికి స్పష్టమైన మార్గం కూడా లేదు.
తనకు తన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే అచంచలమైన సంకల్పం మాత్రమే ఉంది. అదే ఆమెను ధైర్యంగా నడిపించేది. ఇంటర్‌తో ఆపిన చదువుని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఎక్కువ గంటలు పనిచేస్తూ..మరోవైపు తన కుమారులను ఒంటరిగా పెంచుతూ చదువు కొనసాగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. అయితే ఎలాంటి కోచింగ్‌లు లేవు, కనీసం విద్యాపరమైన మద్దతు కూడా లేదు. తీరిక సమయంలోనే చదువుకోవడం ఒక్కటే తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అయినప్పటికీ 2005 ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారామె.
అప్పుడామెకు పోలీస్ సర్వీస్ స్థానంలో పోస్ట్ వచ్చింది. అయితే సవితకు పరిపాలన సేవ చేయడమే ఇష్టం అందుకని మరోసారి 2006లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తను కోరుకున్న పోస్ట్‌ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 83వ ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ పరిపాలన సర్వీస్ అధికారిణిగా స్థానం పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని నరసింగ్‌పూర్ జిల్లాలోని గోటేగావ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత గ్వాలియర్‌లోని పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆమె ఐఏఎస్ కాదు..
అయితే సవితా కథను పలు మీడియాల్లో ఐఏఎస్‌గా అభివర్ణించాయి. ఆ విషయాన్ని స్పష్టంగా చేసేందుకు మళ్లీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను మధ్యప్రదేశ్ పరిపాలనా సేవా అధికారిణి అయిన PCS అధికారిణిని మాత్రమేనని, భారత పరిపాలనా సేవ (IAS) సభ్యురాలిని కాదని స్పష్టం చేశారు. PCS అంటే ప్రధానంగా ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (Provincial Civil Service) అని అర్థం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక సవితా భవిష్యత్తులో ఐఏఎస్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉన్నప్పటికీ..ప్రస్తుతానికి తాను ఏ హోదాలో ఉన్నానో దానికే గర్విస్తున్నానని క్లియర్‌గా చెప్పారు. అయితే పలు మీడియా కథనాల్లో తనను ఐఏఎస్ అధికారిగా చెబుతూ ఏవేవో రాసేశారని, అదంతా కరెక్ట్ కాదంటూ తన స్టోరీని చెప్పుకొచ్చారామె.
ఇక సవితా ప్రధాన్ కథ అసంతృప్తికరమైన వైవాహిక బంధం, చేతిలో ఇద్దరి పిల్లల బాధ్యత అయినా జీవితంపై ఆశ వదులుకునేందుకు ఇష్టపడ లేదు. తనకెదురైన కష్టాలకు ఎదురెళ్లి మరీ..శివంగిలా పోరాడింది. పోనీ పుట్టింట వాళ్లు సైతం ఆదుకోలోని పరిస్థితే అయినా..తన తలరాతను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. ఎలాగైన తన జీవితాన్ని కన్నీళ్లమయంగా కాదు కాంతిమయం మార్చుకోవాలి, ఆనందకరంగా జీవించాలి అని అనుకుంది. కోరుకున్నట్లుగానే సాధించింది, "దటీజ్ సవితా" అని అనిపించుకున్నారామె.
(చదవండి: తొలి అంధ బధిర న్యాయవాది..! చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!)
Tags : 1