sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!

Published on Tue, 09/16/2025 - 04:55

రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి.

 సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ) వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ మంథా జ్ఞాన ప్రకాశ్‌. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. 

ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? 
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: క్లైమేట్‌ ఛేంజ్‌ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్‌లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ  క్లైమేట్‌ ఛేంజ్‌ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్‌ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్‌ జోన్‌లోనే అది సరిగ్గా పనిచేయగలదు. 

పాలు, మాంసం వంట  ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్‌ ఛేంజ్‌ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. 

భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్‌గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. 

అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. 

భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: క్లైమేట్‌ ఛేంజ్‌ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్‌ ఫర్మంటేషన్‌) వల్ల మీథేన్‌ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్‌కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్‌ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. 

పేడ నుంచి కూడా ఉద్గారాలు..?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్‌ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్‌ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్‌ చాలా వరకు తగ్గుతుంది. 

ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్‌ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 

మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. 

ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్‌ ఇంప్రూవ్‌మెంట్‌. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. 

జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: జెనెటిక్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్‌ మాడిఫికేషన్‌ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్‌ మాడిఫికేషన్‌ 
అంటారు. అది రిస్క్‌తో కూడిన పని. అవసరం లేదు. జీన్‌ ఎడిటింగ్‌ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.

ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్‌ టాలరెంట్‌ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్‌ ఇంప్రూవ్‌మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. 

సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్‌ అవసరమా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: పశువుల్లో ఆర్గానిక్‌ బ్రీడ్స్‌ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్‌ సహజంగా ఎవాల్వ్‌ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్‌గా ఎవాల్వ్‌ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. 

ఆర్గానిక్‌ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్‌ రెసిడ్యూస్, థెరప్యూటిక్‌ రెసిడ్యూస్‌ లేని ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్‌ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్‌ 
ఉంటుంది. 

పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? 
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. 

పరిష్కారం ఏమిటి?
ప్రొ. జ్ఞాన ప్రకాశ్‌: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.

ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు
ఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

 

Videos

అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు

వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన

అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్

మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్

దేవుడున్నాడు.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో

ఏడుగురు మృతికి కారకుడైన టీడీపీ నేత

DSC అభ్యర్థుల ఎంపికలో భారీ కుట్ర

Big Question: మీ పాపాలకు అంతం అతి త్వరలోనే!!

అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

Photos

+5

షారుక్‌ ఖాన్‌ కుమారుడి కోసం తరలిన అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)

+5

నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..